``యుద్దంలో గెలిచినా...ఓడినా వీరుడంటారు...కానీ ఆట మధ్యలో వెళ్లిపోయిన వారిని ఏమంటాం...ఆటలో అరటిపండు అంటాం...జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ చేసిన చేసిన విమర్శలు సైతం ఆటలో అరటి పండులాంటివే.`` అని జ‌న‌సేనానిపై వైసీపీ ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్పందించి ఐకమత్యం ప్రదర్శించారని పేర్కొన్నారు. ``దేశాన్ని కాపాడాలనే ప్రజల చిత్తశుధ్ది చూస్తే వారికి చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తోంది. ప్రపంచాన్ని శాసిస్తామని చెప్పిన కొన్ని దేశాలు నేడు కరోనాతో  వణికిపోతున్నాయి. 30 కోట్లు జనాభా ఉండే అమెరికా లాంటి దేశంలో నేటికి 6 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, స్పెయిన్ లాంటి దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. డబ్య్లు హెచ్ ఓ రిపోర్ట్ ప్రకారం మంచి వైద్యసేవలందించే ఇటలీ నేడు ఏ స్దితిలో ఉందో చూస్తున్నాం. ఇలాంటి పరిస్దితుల్లో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.` అని పేర్కొన్నారు.

 

దేశం ఆ రకంగా ఆదర్శంగా నిలిస్తే మన రాష్ర్టం,రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ ఒంటిచేత్తో రాష్ర్టంలోని ప్రజలను కాపాడాలని  చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నామ‌ని వైసీపీ ఎమ్మెల్యే విశ్లేషించారు. ``గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ  వల్ల ఈరోజు ఆంధ్రరాష్ర్టంలో ప్రతి ఇల్లు జల్లెడపట్టి ఎక్కడ ఏ రకమైన పరిస్దితులు ఉన్నాయో తెలుసుకుని ఆయా కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వాటిని అధికారులకు తెలియచేసి ఆరోగ్యసేవలలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రాష్ర్టం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌` అని స్ప‌ష్టం చేశారు. ``చంద్రబాబు మూడు లక్షల కోట్ల అప్పులతో రాష్ర్టాన్ని అప్పుల పాలు చేశారు. అయినప్పటికీ కూడా సీఎం వైయస్ జగన్ అండగా నిలబడి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి జగన్‌కి పబ్లిసిటి చేసుకోవాల్సిన అవసరం లేదు. మాది మేటర్ పీక్ పబ్లిసిటి వీక్. చంద్రబాబు గారిది మేటర్ వీక్ పబ్లిసిటి పీక్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో సైతం చెప్పాం.`` అని స్ప‌ష్టం చేశారు.

 

చంద్రబాబు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే మీడియావారికి ఖాళీ ఉండకపోదు. ప్రతి నిముషం ప్రెస్ మీట్, అధికారులతో సమీక్షలు- సమావేశాలు, వాటిని ఆర్భాటాలు, హంగులు చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకునే పరిస్ధితులు ఉండేవి. కాని మాకు రాష్ర్ట ప్రజల ఆరోగ్యం, వారి భవిష్యత్తు ముఖ్యం,  మేలైన వైద్యాన్ని ప్రజలకు అందించాలనే తాపత్రయంతో జగన్ పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితులలో ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు చూస్తుంటే బాధ అనిపిస్తోంది. ఆశ్చర్యం కలుగుతుంది.` అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: