దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా.. రైళ్ల కూత మూగబోయింది. నిత్యం రద్దీగా ఉండే స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని రైళ్లు క్వారంటైన్ కేంద్రాలుగాగ మారిపోయాయి. రైల్వే వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లాక్ డౌన్ కారణంగా రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. 

 

దేశంలో మొదటి సారి 1853 ఏప్రిల్ 16 న రైల్వే శాఖ సర్వీసును మొదలుపెట్టింది. ముంబాయి నుంచి థానే వరకు సర్వీసును ప్రారంభించింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రయాణికులను వేల కిలోమీటర్ల సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. మొదటి సారి 1974 లో 54 రోజుల సమ్మె కారణంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇప్పడు కరోనా లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. కొంత వరకు కార్గో సర్వీసులు నిర్వహిస్తున్నా.. ఆదాయానికి మాత్రం భారీగా గండి పడుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ తో ప్యాసింజర్ సర్వీసులు పూర్తిగా ...కార్గో సర్వీసులు పాక్షికంగా ఆగిపోయాయి. 

 

లాక్ డౌన్ ప్రభావం రైల్వే శాఖ తీవ్రంగా ఉంది. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగితే 43 రోజుల పాటు రైల్వే సర్వీసులు నిలిచిపోయినట్టు అవుతాయి. రోజు ప్యాసింజర్ సర్వీసులతో 145 నుంచి 150 కోట్ల రుపాయలు ఆదాయం రైల్వేకి వస్తోంది . మార్చి 25 నుంచి లాక్ డౌన్ మొదలైంది .ఏప్రిల్ నెల మొత్తం ప్యాసింజర్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. దీంతో 6 వేల 5 వందల కోట్ల రుపాయల ప్యాసింజర్ సర్వీసుల ఆదాయాన్ని రైల్వే శాఖ కోల్పోనుంది .ఇక సరకు రవాణాతో  రైల్వే శాఖకు 340 నుంచి 345 కోట్ల రుపాయల ఆదాయం వస్తుంది .పూర్తి స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ఈ ఆదాయం కూడా సగమగే వస్తోంది. ప్యాసింజర్ సర్వీసులు రద్దు కావడంతో.. 94 లక్షల టిక్కెట్ల బుకింగ్ కు సంబంధించి 1490 కోట్ల రుపాయలను రిఫండ్ చేయనుంది రైల్వే.

 

లాక్ డౌన్ టైమ్ లోనే కాదు.. తర్వాత కూడా రైల్వే ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. సోషల్ డిస్టెన్సింగ్ కు పబ్లిక్ మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో కొంత కాలం కరోనా ఎఫెక్ట్ రైల్వే శాఖపై ఉండనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: