దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ రాజకీయ వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో... ఆమె ఆయనకు సేవలు చేసుకోవడం, బయటకు వెళ్తుంటే క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయడం, ఇంటికి రాగానే దిష్టి తీయడం లాంటివి తప్ప మరే ఇతర విషయాలలో వేలు పెట్టేవారు కాదు. ప్రస్తుతం తన బిడ్డ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎంగా కొనసాగుతున్నప్పటికీ... ఆమె మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు.


జగన్ 10 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి సీఎం గా ఎంపిక అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున విజయమ్మ హాజరయ్యారని వార్తలు వచ్చాయి తప్ప ఆ తరువాత ఆమె ఇప్పటివరకు వార్తలలో నిలవలేదు. అయితే శుక్రవారం రోజు వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సీఎం జగన్ క్యాబినెట్ లో ని ఓ మంత్రి కి ఫోన్ చేశారు. ఆ మంత్రి మరెవరో కాదు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్‌ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో  100 మంది పైచిలుకు పురోహితులు పితృ కర్మలు చేయిస్తూ కాస్తోకూస్తో డబ్బులు సంపాదించి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ భారతదేశంలో నలభై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుండగా... ఎవరూ కూడా అపర కర్మలు చేయించడానికి వారి వద్దకు రావడం లేదు. దాంతో వారికి రూపాయి కూడా పుట్టడం లేదు.


అయితే వీరి గురించి ఒక కథనాన్ని చదివిన విజయమ్మ వెంటనే చలించి పోయి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఫోన్ చేసి పురోహితులకు సహాయం చేయవలసిందిగా కోరారు. వెంటనే స్పందించిన వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం పొద్దునే పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రాంగణంలో అందరి పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: