తెలంగాణ‌లో కరోనా వ్యాప్తి అరిక‌ట్టే విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి సేడియంలో స్పోర్ట్స్‌ విలేజ్‌ బహుళ అంతస్తుల భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన 1500 పడకల ప్రత్యేక కొవిడ్‌-19 దవాఖానగా తీర్చిదిద్దుతున్నారు. 13 అంతస్తులు.. 1500 పడకలతో సకల హంగులతో వైద్యశాలను సిద్ధం చేస్తున్నారు.  1500 పడకల సామ ర్థ్యం కలిగిన దవాఖానగా యుద్ధప్రాతిపదికన తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ యంత్రాంగం.. ఇందులో 50 పడకల ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ను సైతం ఏర్పాటుచేసి అందుబాటులోకి తెస్తున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలో నిర్విరామంగా వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు దవాఖాన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈనెల 20న అధికారికంగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తుది దశలో కొనసాగుతున్నాయి. 

 

సమైక్య రాష్ట్రంలో 2007లో నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ మిలటరీ గేమ్స్‌ను పురస్కరించుకొని క్రీడాకారుల వసతి కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో గచ్చిబౌలి బాలయోగి క్రీడా స్టేడియంలో స్పోర్ట్‌ విలేజ్‌ భవనాన్ని నిర్మించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్న 1500 పడకల కొవిడ్‌-19 దవాఖాన పనులను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు ఆయా రంగాల్లో నిపుణుల సలహాలతో పూర్తిస్థాయిలో అధునాతన సౌకర్యాలు, వసతులను ఈ దవాఖానలో సమకూర్చుతున్నారు. 


గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ తరహాలో అతిపెద్ద హాస్పిటల్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారు. భవనంలోని 13 అంతస్తుల్లో 1500 పడకల ఏర్పాటుతోపాటు 200మంది డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు, ప్రహరీ మరమ్మతులు, 3000 మందికి అవసరమయ్యే నీటి ట్యాంకుతోపాటు 10 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన సంపును సిద్ధం చేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలెటర్లు, మంచాలు, వైద్యపరమైన మౌలిక వసతులను సమకుర్చుతున్నారు. ప్రత్యేకంగా ఈ దవాఖానకు ఐఎస్‌బీ రోడ్డు వైపు నుంచి మార్గాన్ని ఏర్పాటు చేయ‌డం విశేష‌మ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: