లాక్‌డౌన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైవర్ల జీవితాలతో ఆటలాడుకుంటోంది. రోజులు తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. నిత్యం గిర్రున తిరిగే జీవన చక్రం ఒక్కసారిగా స్తంభించింపోయింది. ఆటోలు...కార్లు...లారీలపై ఆధారపడిన వారి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ప్రజారవాణా నిలిచిపోవడంతో డ్రైవర్ల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. నెలంతా పనులు లేకుండానే గడిచిపోయింది. పైసా ఆదాయం కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోంచి తమను ప్రభుత్వమే గట్టెక్కించాలని వేడుకుంటున్నారు డ్రైవర్లు. 

 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. ఫలితంగా ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోయింది. రోజుల తరబడి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో రాష్ట్రంలో రవాణా రంగం అతలాకుతలమైపోయింది. ప్రధానంగా లారీ యజమానులు అప్పులపాలయ్యారు. కనీసం నిర్వహణకు పైసా ఆదాయం కూడా లేకుండా పోయింది. ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని లారీలన్నీ షెడ్డులకే పరిమితమయ్యాయి.  జిల్లాలో దాదాపు 19 వేల లారీలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ వినియోగం 30 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టే లారీల రాకపోకలు ఏ స్థాయిలో నిలిచిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రవాణా రంగంపై ఆధారపడిన డ్రైవర్లు, క్లీనర్లు వీధిన పడ్డారు. లాక్‌డౌన్‌తో జాతీయ రహదారిపై లారీలు తిరిగేందుకు వీలు లేకుండా పోయింది. వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే రవాణా చేసేందుకు అవకాశం కల్పించారు. 

 

ఇక...పశ్చిమ గోదావరి జిల్లాలో కార్లను నమ్ముకుని జీవించే వారెందరో ఉన్నారు. ప్రతీ రోజూ అద్దెకు తిప్పుతూ కార్లపైనే ఆధారపడిన కుటుంబాలు వేలల్లోనే ఉంటాయి. ఐతే...లాక్‌డౌన్‌ కారణంగా గత కొద్ది రోజులుగా కార్లు ఇంటి నుంచి కదలడం లేదు. వేలాది మంది టాక్సీ డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సాధారణంగా టాక్సీ,  క్యాబ్‌ డ్రైవర్లకు జీతమే జీవనాధారం. ఇందులో వందలాది మంది ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌గా ఉంటూ తేలికపాటి నాలుగు చక్రాల వాహనాలను అద్దెకు తిప్పుతుంటారు. లాక్‌డౌన్‌ కావటంతో రోజుల తరబడి వాహనాలు షెడ్లకే పరిమితం అయ్యాయి. డ్రైవర్లు ఇల్లు గడవక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత వాహనాదారులైతే ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేక సతమతమవుతున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. అప్పిచ్చే నాథుడు కూడా కనిపించక నలిగిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు ఐదు వేల మంది డ్రైవర్లు టాక్సీ, క్యాబ్‌లపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో సుమారు వెయ్యి మంది ఆప్టింగ్‌ డ్రైవర్లు ఉంటారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

మరోవైపు...జిల్లాలో ఆటోవాలాలు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం ఆటోచక్రం తిరిగితేనే వారి ఆకలి తీరుతుంది. లాక్‌డౌన్‌ పుణ్యమా అంటూ రవాణా ఆగిపోయింది. దీంతో ఆటో డ్రైవర్ల బతుకు అగమ్యగోచరంగా మారిపోయింది. ఏప్రిల్‌ 14 తర్వాత రాకపోకలు పునరుద్ధరిస్తారని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆటోవాలాల ఆశలను జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కమ్మేసింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ను పెంచడం వారిని కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపు మూడు వారాలుగా జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ఆటోలపై ఆధారపడి లక్షకు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. మూడు వారాలుగా ఆటోలు ఆగిపోవడంతో వీరి పరిస్థితి దారుణంగా తయారైంది. పూట గడవడమే కష్టంగా మారింది. వీటిలో 80 శాతం బ్యాంకు ద్వారానో లేక ఫైనాన్స్‌ కంపెనీల ద్వారానో తీసుకున్నవే. నెల తిరిగేసరికి తిన్నా తినకపోయినా బ్యాంకులకు, ఫైనాన్స్‌ సంస్థలకు మనీ కట్టాల్సిందే. ఈఎమ్ఐల విషయంలో ఆర్బీఐ ఊరటనిచ్చినా వడ్డీ పడుతుండడంతో ఫైనాన్సర్లు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆటోడ్రైవర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విధి లేక రోడ్డు మీదకు వచ్చి కేసుల బారిన పడుతున్నారు. పోలీసులు ప్రతీరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకుంటే తప్ప తాము ఈ పరిస్థితి నుంచి బయటపడలేమని చెబుతున్నారు ఆటో వాలాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: