తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్ విష‌యంలో సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శృతిమించిన వారిపై ఘాటుగా స్పందిస్తూ కేసులు న‌మోదు చేస్తున్నారు. ప్ర‌ధానంగా, క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ర్గాల‌నే అనుమానం ఉన్న‌వారిపై ఫోక‌స్ పెట్టారు. తాజాగా నల్లగొండ జిల్లా పోలీసులు 17 మంది రోహింగ్యాలపై కేసు నమోదు చేశారు. అంటువ్యాధులు, ప్రమాదకరమైన వ్యాధులను వ్యాపింప జేసే విధంగా వీరు ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ అరెస్టుల అనంత‌రం నల్లగొండ టౌన్‌ ఎస్సై సురేశ్‌ మాట్లాడుతూ... 17 మంది రోహింగ్యాలపై కేసు నమోదు చేశామన్నారు. 

 


దేశంలో అక్రమంగా ఉంటూ లాక్‌డౌన్‌ సమయంలో సమూహిక ప్రార్థనలు కూడా చేస్తున్నారని, నిబంధ‌ను ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. మరి కొందరికి రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్లు గుర్తించామని వారందరినీ ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి క్వారంటైన్‌లో ఉంచడానికి ఛాతి ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. క్వారంటైన్‌ సమయం ముగిసినందున వీరందరిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

 


ఇదిలాఉండ‌గా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 8 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ విష‌యాన్ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ తెలిపారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న వ‌ల‌స కార్మికుల‌కు ప్రాధ‌మిక వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. క‌రోనా ఉన్న‌ట్లు అనుమానం క‌లిగితే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. అలాగే వ‌ల‌స కార్మికుల‌కు ఆహారంతో పాటు సబ్బులు, శానిటైజ‌ర్లు, మాస్కులు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు. న‌గరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌. లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఆ ప్రాంతాల్లో 89పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అక్కడ రాకపోకలపై నిఘాను ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిలో  593మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 63మందికి పాజిటివ్‌ వచ్చిందని, వారి ద్వారా మరో 45మంది వ్యాధి సోకిందన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: