తొందరపడి ప్రేమించడం, క్షణికావేశంలో నేరాలు చేయడం నేటి యువతకి సర్వసాధారణమైపోయింది. ప్రేమించకపోతే ప్రేమించాలంటూ, ప్రేమిస్తేనో తాను చెప్పినట్టు ఉండాలంటూ, తాను చెప్పింది చేయాలంటూ చాలా మంది మగ శాడిస్టులు అమాయకపు అమ్మాయిలకు నరకం చూపిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి తనకు బ్రేకప్ చెప్పిందని అతి కిరాతకంగా చంపేసి కటకటాల పాలయ్యాడు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఉత్తర గోవాలోని ఉసాగోకి వలస వచ్చిన ఓ 17 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఐతే ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి వలస వచ్చిన కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లాకు చెందిన యువకుడు మన్సూర్ హుస్సేన్ షేక్(22) కి ఆమెకి పరిచయం ఏర్పడి... ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇటీవల వారిద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతున్నాయి. దాంతో విసిగిపోయిన సదరు బాలిక తన ప్రియుడు హుస్సేన్ కు బ్రేకప్ చెప్పి తన మానాన తాను వెళ్ళిపోయింది. కానీ తనకు బ్రేకప్ చెప్పినందుకు తీవ్ర నిరాశ తో కూడిన ఆగ్రహానికి గురైన హుస్సేన్ ఆమెపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకానొక రోజు ఆమెతో మాట్లాడాలని చెప్పి పొండా పట్టణానికి సమీపంలోని బోరిమ్ ప్రాంతంలోని జీడి తోటలోకి తీసుకెళ్లాడు.


'నువ్వు లేకుంటే నేను బతకలేకపోతున్నాను. బ్రేకప్ చెప్పకు. మళ్లీ తిరిగి యథావిధిగా ప్రేమించుకుందాం' అంటూ ఆమెకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ బాలిక మాత్రం నీతో మళ్ళీ లవ్వాయణం నడిపించడం నావల్ల కాదు' అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పింది. దాంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయిన సదరు ప్రియుడు ఆమె గొంతు నులిమి అతికిరాతకంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఒక పంపుసెట్టు గదిలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.


అయితే ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పొలం యజమాని పంపు సెట్టు గది నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించగా... హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా... ఓ బాలిక మృతదేహం కుళ్ళిపోయి దర్శనమిచ్చింది. దాంతో పోలీసులు స్థానికంగా మిస్సయిన కేసులను పరిశీలించి... ఆయా కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మృతదేహాన్ని గుర్తించవలసిందిగా కోరగా... అసలు అయిన తల్లిదండ్రులు తమ బాలిక మృతదేహాన్ని గుర్తుపట్టి లబోదిబోమని ఏడ్చారు. అలాగే తన బిడ్డని హుస్సేన్ అనే ఓ యువకుడు హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా... ఆ యువకుడు అసలు విషయం వెళ్లగక్కాడు. దాంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: