దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న మ‌ర్క‌జ్ క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉదంతంపై కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వైర‌స్ వ్యాప్తి విష‌యంలో కీల‌క‌మైన లాక్‌డౌన్ విధించిన కేంద్రం...మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ఈ స్ఫూర్తికి అడ్డుప‌డే అంశాల‌పై దృష్టి సారించింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని మ‌ర్క‌జ్ విష‌యంలో ఫోక‌స్ పెంచారు. ఢిల్లీలో మొత్తం 1893 పాజిటివ్‌ కేసులు ఉండ‌గా అందులో 26 మంది ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో ఆరుగురికి వెంటిటేలర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో దేశంలోని అతిపెద్ద కరోనా కేంద్రాల్లో ఒకటైన ఢిల్లీలోని నరేలా క్వారంటైన్ నిర్వహణను సైన్యం చేపట్టింది. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 


తబ్లీగీ జమాత్ తో సంబంధమున్న 932 మంది ప్రస్తుతం ఈ వైద్యకేంద్రంలోనే ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం మార్చి మధ్యలో ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. మొదట్లో 250 మంది విదేశీయులతో పాటు మొత్తం 1250 మంది ఉండేవారు. ప్రస్తుతం 932 మంది తబ్లీగీలు మాత్రమే మిగిలారు. వారిలో 367 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, వైద్యుల‌పై దాడులు జ‌రగ‌డం స‌హా ఇత‌ర ఉదంతాల నేప‌థ్యంలో నరేలాలోని క్వారంటైన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్టు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తారు. ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన వైద్యుల పనిభారం తగ్గించేందుకు సైన్యం ముందుకు వచ్చింది. ఇకనుంచి ఢిల్లీ వైద్యులు కేవలం రాత్రి పూట మాత్రమే డ్యూటీలో ఉంటారని. భారత సైన్యం ఈ ప్రకటనలో వివరించింది. 

 

   


సైనిక బృందంలో ఆరుగురు మెడికల్ ఆఫీసర్లు, 18 మంది ప్యారామెడికల్ సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగానే విధుల నిర్వహణకు ముందుకు వచ్చారని వివరించింది. సైనిక వైద్య సిబ్బంది వృత్తిపరమైన వైఖరి రోగుల మనసుకు హత్తుకుందని, పౌర వైద్యులతో కూడా వారికి చక్కటి సమన్వయం ఏర్పడిందని సైన్యం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: