ఇప్పుడంతా క‌రోనా క‌ల‌వ‌ర‌మే. దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో దాన్ని కంట్రోల్ చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే వైర‌స్ క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్ అమ‌లులో ఉన్న కొన్ని గంట‌ల పాటు నిత్యావ‌స‌రాల కోసం ప్ర‌జ‌ల‌కు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వెసులుబాటు క‌ల్పించాయి. ఈ క్ర‌మంలో క‌రోనా బారిన‌ప‌డ‌కుండా మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తూ బ‌య‌ట‌కు వ‌స్తే మాస్క్ ఒడిశా, తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాలు త‌ప్ప‌నిస‌రి చేశాయి. దీనికి తోడుగా, ఆల్ ఇండియా పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్ ఓ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది.

 

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపిస్తున్న నేప‌థ్యంలో పెట్రోల్ బంకుల్లో ప‌ని చేసే వ‌ర్క‌ర్స్ కూడా హీరోలే అనే సంగ‌తి తెలిసిందే. అయితే, పెట్రోల్ పంపుల వ‌ద్ద జ‌నం గుమ్మిగూడే ప్ర‌మాదం ఉంది. కోవిడ్‌19 నుంచి జాగ్ర‌త్త‌గా ఉండేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన స‌మ‌యంలో.. ముఖానికి మాస్క్‌లు లేకుండా వ‌చ్చే వారికి పెట్రోల్ పోయ‌రాదు అని నిర్ణ‌యించిన‌ట్లు డీల‌ర్స్ సంఘం అధ్య‌క్షుడు అజ‌య్ బ‌న్స‌ల్ తెలిపారు. త‌మ సిబ్బంది భద్ర‌తా దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌హమ్మారి త‌గ్గే వ‌ర‌కు ఇలాగే ఆంక్ష‌లు ఉంటాయ‌ని  తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు క‌ట్టుకోవ‌డం త‌మ వ‌ర్క‌ర్స్ తో పాటు క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా మంచిద‌ని చెప్పారు. అందుకే మాస్కులు క‌ట్టుకుని వ‌చ్చిన వారికి మాత్ర‌మే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లేదా మ‌రే ఇంధ‌న‌మైనా ఫిల్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

 

ఇదిలాఉండ‌గా, దేశంలో ఫ్యూయల్ డిమాండ్ భారీగా పడిపోయింది. డీజిల్ అమ్మకాలు నాలుగో వంతు తగ్గిపోగా.. పెట్రోల్ అమ్మకం 15 శాతం తగ్గి పోయింది. ఇక జెట్ ఫ్యూయల్ కూడా అదే విధంగా కుప్పకూలింది. దీనికంతటికీ కారణం కరోనా. ఈ వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో, వ్యాపారాలు, రవాణా అంతా స్తంభించింది. విమానాల రాకపోకలు లేవు. చాలా మంది ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. ప్రయాణాలనేదే లేదు. దీంతో ఫ్యూయల్ డిమాండ్ భారీగా త‌గ్గిపోయిందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. మార్చిలో డీజిల్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే 24 శాతం పడిపోయింది. మొత్తం ఆయిల్ డిమాండ్‌లో ఒక్క డీజిల్‌ డిమాండే 40 శాతం వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: