ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఎంత పెరుగుంతుందో, అంతే స్థాయిలో దానిమీద రాజకీయం కూడా పెరుగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కరోనాపై మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలు చేసే విమర్శలు తట్టుకోలేకపోవడమో, లేక భరించలేకపోతున్నారో తెలియదు గానీ, కాస్త వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేసేప్పుడు మరీ వ్యక్తిగతంగా వెళ్లిపోతున్నారు. అసలు చంద్రబాబుని అయితే దారుణంగా విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

 

తాజాగా కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుతో పాటు ఆయన ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చూసి నిజంగా నవ్వాల్నో, ఏడవాల్నో అర్థంకావడం లేదని, అధికారం పొగొట్టుకున్నాడని, చిన్నబాబును ఓడగొట్టుకున్నాడని, పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలంలాగా అంటిపెట్టుకుని ఉన్నాడని అన్నారు. ఇంకా ఇవేగాక లోకేష్ ని ఉద్దేశించి కూడా సెటైర్లు వేశారు. ఇక విజయసాయి...చంద్రబాబుతోనే వదిలిపెట్టకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైన కూడా విమర్శలు చేశారు. కన్నా, బాబుకు అమ్ముడుపోయారని మాట్లాడారు.

 

అయితే విజయసాయి మాటలకు టీడీపీ, బీజేపీల నుంచి రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, విజయసాయిరెడ్డి విశాఖను నాశనం చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక పనిలో పనిగా బీజేపీ కూడా విజయసాయి వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకుంది. విజయసాయి జైలు పక్షి అని, బ్రోకర్, చీకట్లో చిల్లర లెక్కలు వేస్తారంటూ బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

 

అలాగే విజయసాయి బ్రతుకంతా కేసులు,సూట్ కేసులే అంటూ మండిపడుతూనే, విజయసాయి పాపం పండే రోజు దగ్గరలో ఉందంటూ ఘాటుగా స్పందించింది. అయితే విజయసాయి వ్యాఖ్యలపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఏపీ బీజేపీ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక మరొకసారి నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం హెచ్చరిస్తుంది. మరి చూడాలి విజయసాయి వ్యాఖ్యలని కేంద్ర పెద్దలు పట్టించుకుంటారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: