క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణ‌మైన చైనాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన నిర్ణ‌యం రూపంలో భార‌త‌దేశం చైనాకు చెక్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని సవరించి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి భారత కంపెనీల్లోకి అవకాశవాద పెట్టుబడులు రాకుండా నిరోధించే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాగా , చైనాకు ఇది ఊహించ‌ని షాక్ అని విశ్లేష‌కులు చెప్తున్నారు. చైనా సెంట్రల్‌ బ్యాంకు ఇటీవల హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో తన వాటాను 1 శాతానికిపైగా పెంచుకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య చేపట్టింది.  కొత్త ఎఫ్‌డీఐ నిబంధనలను తీసుకొచ్చిన‌ప్ప‌టికీ... చైనా త‌న దూకుడు చ‌ర్య‌ల‌ను ఆపుతుందా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

తాజాగా చేసిన‌ మార్పులలోని కొత్త నిబంధనల ప్రకారం పొరుగు దేశాల నుంచి భారత కంపెనీల్లోకి వచ్చే ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. భారత్‌తో సరిహద్దును పంచుకొంటున్న చైనా లాంటి అన్ని దేశాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రత్యక్ష పెట్టుబడులతో భారత కంపెనీల యాజమాన్య హక్కులను బదిలీచేసే ప్రక్రియకూ ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశీ సంస్థలు, వ్యక్తులు అవకాశవాద పెట్టుబడులతో భారత సంస్థలను స్వాధీనం చేసుకోకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టినట్టు డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌) ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘రక్షణ, ఖగోళ, అణు విద్యుత్‌ లాంటి నిషేధిత రంగాలు/కార్యకలాపాల్లో మినహా మిగిలిన రంగాల్లో విదేశీ సంస్థలు, లేదా వ్యక్తులు ఎఫ్‌డీఐ నిబంధనలకు లోబడి ఆటోమ్యాటిక్‌ మార్గం ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ భారత్‌తో సరిహద్దును పంచుకొంటున్న పొరుగు దేశాల్లోని కంపెనీలు, వ్యక్తులు మాత్రం ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి పెట్టుబడులు పెట్టేందుకు వీల్లేదు’ అని డీపీఐఐటీ స్పష్టం చేసింది. 

 

 చైనా కంపెనీలు ఇటీవల పలు దేశాల్లో తక్కువ ధరకు ఆస్తులను కొనుగోలు చేయడంతో వాటి లావాదేవీలపై ప్రపంచవ్యాప్తంగా నిఘా కొనసాగుతున్నది.  ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు జరిపే ఆస్తుల కొనుగోళ్లపై అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు కూడా విధించాయి. చైనా కంపెనీలు, బ్యాంకులు భారత్‌లో జరుపుతున్న ఈక్విటీ లావాదేవీలపై మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ  దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: