ఆయనో మాజీ మంత్రి.. మొన్నటి వైసీపీ సునామీలోనూ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే. ఒకసారి గెలిచిన చోట మళ్లీ గెలవడం కానీ.. పోటీ చేసిన చోట ఓడిపోవడం కానీ.. అలవాటు లేని రాజకీయ నాయకుడాయన.. ఇప్పటికే మూడు పార్టీలు మారిన ఆయన మళ్లీ ఇప్పుడు వైసీపీలోకి వస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలు మార్చడం ఆయనకు బ్రాండెడ్ చొక్కాలు మార్చడం అంత ఈజీ కనుక.. అది నిజమే కావచ్చన్న ప్రచారమూ జరుగుతోంది.

 

 

అయితే ఇప్పుడు వైసీపీ నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో చెప్పలేదు. కదా.. ఈపాటికి మీరు గెస్ చేసే ఉంటారు.. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేర్చుకోవడం లేదని ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తేల్చి చెప్పేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జీ కెకె రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.

 

 

ఒకసారి గెలిచిన తర్వాత ప్రజలను మరిచిపోవడం గంటాకు అలవాటని, ఒకసారి గెలిచిన చోట మరల ఎన్నికల్లో పోటీ చేయరని ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి గంటా పై కామెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆయన అన్నారు.

 

 

సో.. గంటా శ్రీనివాసరావుకు వైసీపీలోకి ఇప్పట్లో ఎంట్రీ దొరికే ఛాన్స్ లేదన్నమాట. విజయసాయిరెడ్డి వంటి కీలక నేత చెప్పారంటే ఇక దాదాపుగా గంటాకు దారులు మూసుకుపోయినట్టే. అయితే గంటాను అంత తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆయన మహా ఘటికుడు. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో...?

 

మరింత సమాచారం తెలుసుకోండి: