రాజకీయం.. ఎక్కడైనా రాజకీయమే.. అది అమెరికా అయినా.. అనకాపల్లి అయినా అహ్మదాబాద్ అయినా.. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి రుజువు చేస్తున్నాడు. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ విషయంలో ట్రంప్ ప్రత్యర్థి ఎవరో కూడా తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

 

 

అందుకే ట్రంప్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అమెరికాలో మరోసారి జాతీయ భావం రగిల్చే పనిలో పడ్డారు. అందుకు కరోనా అంశాన్ని వాడుకుంటున్నారు. అలా కరోనా సమస్య - చైనా అంశం అమెరికాలో ఎన్నికల వివాదంగా మారుతోంది. ఇటీవల అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పై తీవ్రంగా విమర్శలు కురిపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని స్పష్టమైతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ వార్నింగులు ఇచ్చేశారు.

 

 

1917 తర్వాత అమెరికాలో ఇంత ప్రాణ నష్టం జరగలేదని డోనాల్డ్ ట్రంప్ గుర్తు చేస్తున్నారు. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునేదిలేదని ట్రంప్ చైనా పై రంకెలు వేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తెలిసి కూడా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైతే తీవ్ర చర్య ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద చైనాపై కఠినంగా ఉండటం ద్వారా అమెరికన్ల ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు.

 

 

ఇదే సమయంలో ట్రంప్ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ పై కూడా చైనా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. బిడెన్ అభ్యర్థిత్వానికి చైనా మద్దతుగా నిలుస్తోందని ట్రంప్ విమర్శిస్తున్నారు. ఒకవేళ బిడెన్ గెలిస్తే అమెరికాను చైనా దేశం స్వాధీనం చేసుకుంటుందని తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అమెరికన్లు ట్రంపు ప్రచారం నమ్ముతారా.. మరోసారి అధికారం కట్టబెడతారా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: