లాక్‌ డౌన్ కారణంగా జనం ఇళ్లలో బంధీలయ్యారు. ఈ కారణంగా టీవీ ఛానళ్ల రేటింగులు పెరిగిపోతున్నాయి. అందులోనూ కరోనా వార్తల కారణంగా న్యూస్ ఛానళ్లకూ బాగానే రేటింగులు వస్తున్నాయి. అయితే ఎంతగా జనం న్యూస్ చూసినా.. వాటి పరిమితి ఓ స్థాయి వరకే.. జనం ఎంటర్‌టైన్ మెంట్ చూసినంతగా న్యూస్ చూడరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం లెక్కలు మారతాయి.

 

 

ఇప్పుడు అదే జరుగుతోంది. ఈటీవీలో రాత్రి 9 గంటలకు వచ్చే న్యూస్ బులెటిన్‌ కు సాధారణంగా మంచి ఆదరణ ఉంటుంది. రోజంతా జరిగిన అతి ముఖ్యమైన అంశాన్నేది వదలకుండా అరగంటలో మొత్తం ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందు ఉంచుతారు. ఊకదంపుడు సోది లేకుండా స్ట్రయిట్ ఫార్వార్డ్ గా విషయంలోకి వచ్చేస్తారు. ఈ బులెటిన్ చూస్తే చాలు ఆ రోజు జరిగిన ముఖ్యమైన వార్త ఏదీ మిస్ కాదు.. అన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ బులెటిన్ కు అంత ఆదరణ.

 

 

అయితే ఈ లాక్ డౌన్ సమయంలో ఈ న్యూస్ బులెటిన్ రేటింగ్ అమాంతం పెరిగింది. ఎంతగా అంటే..ఆ టైమ్ స్లాట్‌ లో ఎంటర్‌టైన్‌ మెంట్ ఛానళ్ల రేటింగులు కూడా ఈటీవీ ముందు దిగదుడిపే అన్నమాట. తాజా గణాంకాలు పరిశీలిస్తే.. మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి చూసుకుంటే.. రాత్రి9 గంటల స్లాట్ లో జెమినీ టీవీ 3.4, స్టార్‌మా 3.3, జీ తెలుగు 1.8 రేటింగ్‌ తెచ్చుకుంటే.. టీవీ న్యూస్ బులెటిన్ మాత్రం ఏకంగా 11 పాయింట్లు తెచ్చుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

 

 

ఇక ఎంటర్‌ టైన్ మెంట్ చానళ్ల రేటింగులే అలా ఉంటే.. న్యూస్ ఛానళ్ల రేటింగుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అయినా చెప్పుకుందాం.. అదే సమయంలో టీవీ9 రేటింగ్ 1.2, టీ న్యూస్ 0.8, వీ6 0.7, టీవీ5 0.3 ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈటీవీ9 పీఎం న్యూస్ ఏ రేంజ్‌లో వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటుందో అర్థమవుతోందిగా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: