ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 81,000 మందికి ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే దాదాపు లక్ష కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 23 లక్షల 80 వేలకు చేరింది. నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలను ప్రకటించింది. గత 24 గంటల్లో 6,453 మంది కరోనా భారీన పడి మృతి చెందగా మృతుల సంఖ్య 1,52,000 కు చేరింది. 
 
ప్రపంచంలోని పలు దేశాలు కరోనా ధాటికి అతలాకుతలవుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ లో నిన్న 550 మంది మృతి చెందారు. అమెరికన్లు ఆకలి, నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ వల్ల దాదాపు రెండు కోట్ల మంది అమెరికన్లకు పని లేకుండా పోయింది. దక్షిణ కొరియాలో 20 రోజుల క్రితం 800 కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 8కి తగ్గింది. 
 
మరోవైపు జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ లలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచనలు చేసింది. స్పెయిన్ మే 9 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఈ నెల 27 నుంచి కొంత సడలింపులు ఇస్తామని ప్రకటన చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
యూకేలోని వృద్ధుల సంరక్షణాలయాల్లో మాత్రం 7 రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపైంది. ఇప్పటివరకు యూకేలో 2,500 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ ప్రధాని జాన్సన్ కరోనా నుంచి కోలుకుని అధికార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇటలీలో ప్రభుత్వం జరిమానాలు విధిస్తున్నా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. సింగపూర్ లో కొత్తగా 596 మందికి కరోనా సోకగా వారిలో 571 మంది విదేశీయులే కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: