అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంటిపోరు ఎదుర‌వుతోంది. అస‌లు స‌మ‌యంలో ఆయ‌న‌కు షాకులు త‌గులుతున్నాయి. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఒక‌దాని త‌ర్వాత ఒకటి అన్న‌ట్లుగా ట్రంప్ ఇరుకున ప‌డుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ల‌క్షా 65 వేల మంది చ‌నిపోయారు. అమెరికాలో వైర‌స్ సోకిన వారి సంఖ్య 7 ల‌క్ష‌లు దాటింది. ఇక మ‌ర‌ణించిన వారి సంఖ్య 41 వేలుగా ఉంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాల‌ను విధించారు. అయితే, దీనిపై నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

 

స్టేట్ ఎట్ హోమ్ లాంటి క‌ఠిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని కొంద‌రు ఆందోళ‌న‌కారులు దేశ‌వ్యాప్తంగా భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. జీవ‌నోపాధి కోల్పోయిన వేలాది మంది వీధుల్లో ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ట్రంప్ మ‌ద్ద‌తుదారులు సోష‌ల్ డిస్టాన్సింగ్ నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాల‌ను గ‌వ‌ర్న‌ర్లు ఎత్తివేయాల‌ని నిర‌స‌న‌కారులు డిమాండ్ చేశారు. మిచిగ‌న్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. వారిని స‌మ‌ర్థిస్తూ ట్రంప్ మాట్లాడారు. ఆంక్ష‌ల నుంచి స్వేచ్ఛ క‌ల్పించాలంటూ ఇటీవ‌ల ట్రంప్ కొంద‌రు డెమోక్ర‌టిక్ గ‌వ‌ర్న‌ర్ల‌ను కోరారు. దేశంలోని అనేక ప్రాంతాలు సాధార‌ణ స్థితి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పారు. కాగా, మే ఒక‌ట‌వ తేదీ క‌న్నా ముందే దేశంలో ఆంక్ష‌ల‌ను స‌డ‌లించాల‌ని ట్రంప్ ప్ర‌భుత్వం భావిస్తోంది. వైర‌స్ నియంత్ర‌ణ‌కు విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు చేప‌ట్టాల‌ని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లే జాప్యం చేస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ గ‌వ‌ర్న‌ర్లు మాత్రం ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్ల విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌డం లేదంటున్నారు. ప్ర‌తి రోజు ఎక్కువ స్థాయిలో క‌రోనా ప‌రీక్ష‌లు చేపట్టిన త‌ర్వాత‌నే ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తామ‌ని కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గెవిన్ న్యూస‌మ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు త‌మ ప‌నిని వేగ‌వంతం చేయాల‌ని ట్రంప్ కోరారు. కాగా, అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ ప‌రిణామాలు ఆయ‌న విజ‌యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: