క‌రోనా నేప‌థ్యంలో కొన్ని దుర‌దృష్టాలు, ఊహించ‌ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే మ‌రికొన్ని తీపిక‌బుర్లు, లాభాలు సైతం జ‌రుగుతున్నాయి. తాజాగా అలాంటి తీపిక‌బురే ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. కరోనా దెబ్బకు ముడి చమురు మార్కెట్‌ కుదేలవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్లతో చమురు వినియోగం అసాధారణ స్థాయిలో తగ్గిపోయింది. దాంతో చమురు ధరలు మూడుదశాబ్దాల క్రితంనాటికి పడిపోయాయి. రికార్డు స్థాయిలో గ‌త 21 ఏళ్ల‌ల్లో ఏనాడూ లేనంతగా ముడి చ‌మురు ధ‌ర త‌గ్గింది. అయితే, దీని వ‌ల్ల మ‌న‌కు ద‌క్కే ప్ర‌యోజ‌నం గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. 

 

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం ఒక్కసారిగా తగ్గిపోయింది. దాంతో డిమాండ్‌లేక చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమై చమురు ఉత్పత్తి దేశాలకు తీవ్ర వత్తిడిలోకి నెట్టాయి. పశ్చిమ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (డబ్ల్యూటీఐ)లో సోమవారం బ్యారెల్‌ ముడి చమురు ధర కనీవినీ ఎరుగని విధంగా 15 డాలర్లకు పడిపోయింది. గత 21 ఏండ్లలో ఈ స్థాయిలో చమురు ధర పతనమవటం ఇదే మొదటిసారి.  చమురు ఉత్పత్తి దేశాలపై ఒపెక్ ప్లస్ కూటమి ఇటీవల సమావేశమై రోజూ తమ ఉత్పత్తిలో దాదాపు కోటి బ్యారెళ్లను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అయినా వచ్చే మూడువారాల్లో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం లేదని ప్రముఖ రేటింగ్ సంస్థ గోల్డ్‌మన్‌సాచ్ తెలిపింది.

 

ఒపెక్ దేశాల మధ్య కుదిరిన ఉత్పత్తి తగ్గింపు నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితుల్లో చమురు ధరలను పెంచలేదని, అందువల్ల మరికొన్ని వారాలపాటు ధరలు తగ్గుతూనే ఉంటాయని అభిప్రాయపడింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కోటీ 90 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగం తగ్గే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నిర్ణయించిన ఉత్పత్తి తగ్గింపు చర్యలు ధరల పతనాన్ని ఆపలేవని స్పష్టంచేసింది. ధరల విషయంలో నిన్నమొన్నటివరకు తీవ్రంగా విభేదించుకున్న రష్యా, సౌదీ అరేబియా ఎట్టకేలకు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయానికి వచ్చాయి. కానీ రోజుకు 4 లక్షల బారళ్ల చమురు ఉత్పత్తి చేసే మెక్సికో మాత్రం ఉత్పత్తి తగ్గించుకోవటానికి ఇంకా అంగీకరించలేదని బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ తెలిపింది. మొరాకో మొండిప‌ట్టుపై ఉంటే, మిగ‌తా దేశాలు సైతం ధ‌ర‌లు త‌గ్గించేలా ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: