దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో నిన్నటివరకు 647 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదు కాగా గుంటూరులో 129 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,60,000 కుటుంబాలకు 25 లక్షల సీ విటమిన్ ట్యాబ్లెట్లు అందజేశారు. 
 
ఒక్కో కుటుంబానికి 15 ట్యాబ్లెట్ల చొప్పున ఎమ్మెల్యే వీటిని పంపిణీ చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే ఎంపీడీవో కార్యాలయంలో టాబ్లెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్ కార్డు లేని వారికి ప్రయోజనం చేకూరేలా చెవిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 6,000 కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని... వారికి కూడా రేషన్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
నిన్న సాయంత్రం ఎమ్మెల్యే అధికారులతో కరోనా నియంత్రణ కోసం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కరోనా నియంత్రణ కోసం అధికారులు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 75 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 722కు చేరింది. ఈరోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25, గుంటూరులో 20, కర్నూలులో 16, కృష్ణా జిల్లాలో 5, కడపలో 3, అనంతపురంలో 3, తూర్పుగోదావరిలో 3 కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: