కీల‌క స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇంకా చెప్పాలంటే యూట‌ర్న్ తీసుకుంది. నేటి నుంచి అమ‌ల్లోకి రావాల్సిన మొబైల్స్‌ తదితర అత్యవసరం కాని వస్తూత్పత్తుల అమ్మకాలనూ జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం వెనక్కి తీసుకుంది. కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక అనేక కార‌ణాలు వేరే ఉన్నాయ‌ని అంటున్నారు. 

 


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మే 3 దాకా లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించిన సంగతీ విదితమే. లాక్‌డౌన్‌ నుంచి అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు వెసులుబాటు లభించిందనుకున్న ఈ-కామర్స్‌ సంస్థలకు కళ్లెం వేసింది. పప్పుదినుసులు తదితర ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు వంటి అత్యవసరాల సేవలు మినహా మిగతా వాటిని ఆపేయాలని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ మొదలగు ఆన్‌లైన్‌ సంస్థలను మోదీ సర్కారు ఆదేశించింది. ఈ నెల 20 నుంచి మొబైల్‌ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు, వాషింగ్‌ మెషీన్లు, రెడిమేడ్‌ దుస్తులు తదితర నాన్‌-ఎసెన్షియల్‌ సేల్స్‌ను కూడా ఈ-కామర్స్‌ సంస్థలు జరుపవచ్చని 15వ తేదీన కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ సంస్థలన్నీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు కూడా తీసేసుకున్నాయి. ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్పష్టం చేశారు.

 

ఈ నిర్ణ‌యం వెనుక రిటైల్ మార్కెట్ ఒత్తిడి కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఆన్‌లైన్‌ మార్కెట్‌ జోరందుకున్న దగ్గర్నుంచి సంప్రదాయ రిటైల్‌ మార్కెట్‌ కళ తప్పింది. ఈ-కామర్స్‌ సంస్థలు ఇస్తున్న ఆఫర్లు.. రిటైలర్ల వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు మొబైల్‌ ఫోన్స్‌, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర నాన్‌-ఎసెన్షియల్‌ అమ్మకాలకు అనుమతి ఇవ్వొద్దని, కేంద్రంపై రిటైలర్లు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. వారిని అనుమతిస్తే.. తమ షాపులూ తెరుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని స్థానికి వ్యాపారులు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం తమ నిర్ణయంపై ఎందుకు యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ బదులిచ్చారు. వైరస్‌ ఉధృతి క్రమేణా పెరిగిపోతున్నదని, పరిస్థితులపై రోజువారీ సమీక్షలు జరుపాల్సి వస్తున్నదని తెలిపారు. కరోనా తీవ్రతతో నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తున్నదని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: