ముంబయి, పుణె, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, బెంగాల్ లోని మరికొన్ని ప్రాంతాల్లో  కొవిడ్‌-19 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘిస్తే, సరైన చర్యలు తీసుకోకుంటే  కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది. అయితే కేంద్ర బృందాలు పంపాలన్న నిర్ణయంపై సరైన వివరణ ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. 

 

కొవిడ్‌-19పై పోరాడుతున్న వైద్యులు, వైద్య సహాయకులపై దాడులు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. వెంటనే వీటిని అడ్డుకోవాలని సూచించింది. కొన్ని నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌, మహారాష్ట్రలో ముంబయి, పుణె, రాజస్థాన్‌లో జైపుర్‌, పశ్చిమ బెంగాల్ లో కోల్‌కతా, హౌరా, తూర్పు మేదినిపుర్‌, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్‌, కలింపాంగ్‌, జల్‌పాయ్‌గురిలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్రం తెలిపింది. ఇక్కడ లాక్ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నివేదికలు అందాయన్న కేంద్రం.. అది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించింది.

 

ఒక్క మహారాష్ట్రలోనే 4,203 కొవిడ్‌-19 కేసులు నమోదవ్వగా.. 223 మంది మరణించారు. రాజస్థాన్‌లో 1,478 కేసులు, 14 మరణాలు ఉన్నాయి. బెంగాల్ లో 339 కేసులు, 12 మరణాలు ఉన్నాయి. దీంతో ప్రమాదకర ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రిత్వ శాఖల బృందాలు ఏర్పాటు చేసింది కేంద్రం. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్ లో వీరు అవసరమైన దిశానిర్దేశం చేస్తారని వెల్లడించింది. 

 

మార్గనిర్దేశాల ప్రకారం లాక్‌డౌన్‌ నిబంధనల అమలును కేంద్ర బృందాలు పర్యవేక్షిస్తాయని చెప్పింది. నిత్యావసర సరుకుల పంపిణీ, వ్యక్తిగత దూరం, వైద్యపరమైన మౌలిక సదుపాయాల సంసిద్ధత, సహాయ కేంద్రాల్లో కూలీలు, పేద ప్రజల యోగ క్షేమాలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడులో వైద్యసిబ్బంది, పోలీసులపై దాడులు జరిగిన తరుణంలో.. కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. కానీ పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర బృందాలను పంపాలన్న హోం శాఖ నిర్ణయంపై సీఎం మమత బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతును, సలహాలను స్వాగతిస్తున్నామని.. అయితే కేంద్ర బృందాలను ఎందుకు పంపాలని కేంద్రం భావిస్తుందో సరైన కారణాలు తెలియజేయాలని ఆమె అడిగారు. సరైన కారణాలు లేకుండా తాను రాష్ట్రంలోకి కేంద్ర బృందాలను అనుమతించినట్లయితే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుందని మమత ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: