కరోనా వ్యాధి  నిర్ధారణ పరీక్షల  కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా  పెద్ద దుమారాన్నే రేపుతోంది . ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల  కొనుగోలు వ్యవహారం లో అవకతవకలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ కు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధీటుగా స్పందిస్తూ, సమాధానంగా  చేసిన ట్వీటే ఈ రాజకీయ  దుమారానికి కారణమన్న  వాదనలు విన్పిస్తున్నాయి .

 

 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కన్నా చేసిన ట్వీట్ కు సమాధానంగా ,  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మధ్యవర్తిగా  కన్నా  20 కోట్లకు అమ్ముడుపోయారంటూ విజయసాయి చేసిన ఆరోపణలు రెండు పార్టీల మధ్య మాటల, ట్వీట్ల యుద్ధానికి దారితీశాయి  . ఇదే అంశంపై కన్నా లక్ష్మీనారాయణ ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలు వ్యవహారం పై వైద్యారోగ్య శాఖ మంత్రి , ఆ శాఖకు సంబంధించిన అధికారులు కిట్ల ధర పై పరస్పరం భిన్నమైన ప్రకటన చేయడం వల్లే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు .

 

దానికి ప్రభుత్వం తరుపున ఆ శాఖ  మంత్రి సమాధానం చెబితే సరిపోయి ఉండేదని కానీ విజయసాయి వ్యక్తిగత ఆరోపణలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు . ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో ఏమి జరగకపోతే ,  విజయసాయి ఎందుకు భుజాలు తడుముకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు . ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువ ధర చెల్లించి కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు చేస్తున్న అంశం పై బీజేపీ నేతలు స్పందించకుండా , వైద్యారోగ్య శాఖ మంత్రి , ఆ శాఖ అధికారులు టెస్టు కొనుగోలు ధర పై  భిన్నమైన ప్రకటన చేయడాన్ని మాత్రమే తాము ప్రశ్నిస్తే , విజయ సాయి ఎదురుదాడి చేయడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: