విజయవాడలో కరోనా మూడో స్టేజ్ లో ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 75 కేసులు నమోదైతే.. విజయవాడలోనే 66 పాజిటివ్ కేసులొచ్చాయి. అసలు వైరస్ ఎక్కడ నుంచి వ్యాప్తి చెందుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. 

 

వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావటం తొలి దశ. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టు వల్ల పాజిటివ్ రావటం రెండో దశ. అసలు వైరస్ ఎవరి నుంచి వచ్చిందో తెలియకుండానే పాజిటివ్ రావటం మూడో దశ. ప్రస్తుతం విజయవాడలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు కావటం.. అత్యంత ప్రమాకర పరిస్థితిని తెలియజేస్తోంది. తొలుత నమోదైన నాలుగు కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివే. ఆ తర్వాత వారి నుంచి కాంటాక్టు ద్వారా ఒకరిద్దరికి రావటంతో వారిని గుర్తించారు. ఇక ఆ తర్వాత నమోదైన 30 నుంచి 35 కేసులు మర్కజ్ వల్ల వచ్చాయి. దీంతో అధికారులు ఢిల్లీ వెళ్లి.. అందర్నీ గుర్తించి.. క్వారంటైన్లకు తరలించారు. కానీ నాలుగు రోజులుగా విజయవాడలో నమోదవుతున్న కేసులకు మాత్రం సోర్స్ తెలియడం లేదు. దీంతో ఆందోళన నెలకొంది. 

 

తాము ఎక్కడకు వెళ్ళ లేదని, మార్కెట్‌ కు వెళ్ళామని ఒకరు, రైతుబజార్ కు మాత్రమే వెళ్ళామని మరొకరు చెబుతున్నారు. ఇళ్ళకే పరిమితమయ్యామని, మార్కెట్లకు మాత్రమే వెళ్ళి వచ్చామని చెబుతున్నారు. దీనితో అధికారులు వీరికి ఎలా వైరస్ సోకిందనే అంశంపై దృష్టిపెట్టారు. ప్రధానంగా లాక్ డౌన్ సందర్భంగా రోడ్ల మీదకు రాని వారంతా ఇళ్ళ దగ్గరే సమూహాలుగా కూర్చుంటున్నారని అధికారులు గుర్తించారు. ఇళ్ళ దగ్గర మహిళలు కూర్చొని మాట్లాడుకోవటం, ఇళ్ళ దగ్గర పిల్లలు గుంపులుగా ఆడుకోవటం, కొందరు గదుల్లో కూర్చుని పేకాడుకోవటం ఇలాంటి చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రైతుబజార్లకు, నిత్యావసర వస్తువుల కోసం మార్కెట్లకు వెళ్ళి వస్తున్నామని చెబుతున్నారు. అంటే ఇక్కడే వీరికి వైరస్ సోకిందని ప్రాధమిక నిర్ధారణకు అధికారులు వచ్చారు.

 

అధికారుల విచారణలో రైతుబజార్లే వైరస్ విస్తరించటానికి కేంద్రంగామారాయని గుర్తించారు. ఎలా వైరస్ సోకిందో తెలియదని చెబుతున్న వారిలో ఎక్కువ మంది తాము రైతుబజార్లకు తప్ప ఎక్కడకు వెళ్ళలేదని చెబుతున్నారు. దీనితో ఇక్కడ వైరస్ సోకిన వారు సామాజిక దూరం పాటించకపోవటం, ఎక్కువమంది గుంపులుగా రావటంతో వైరస్ సోకుతోంది. వీరు తమ తమ ఇళ్ల వద్దకు వెళ్ళి సామాజిక దూరంగా పాటించకపోవటంతో అక్కడ వ్యాప్తి చెందుతోందని ప్రాధమిక నిర్ధారణగా తేల్చారు. దీనితో నేడు బెజవాడలో అన్ని రైతుబజార్లను మూసేశారు. మొబైల్ రైతుబజార్లను అంటే ఇళ్ళ వద్దకే కూరగాయల బండి పంపేలా చర్యలు చేపట్టారు. ఇక సందుల్లో, ఇరుకు రోడ్లలో సమూహాలుగా ఉన్న వారిని గుర్తించటానికి డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఎవరు రోడ్ల మీదకు వచ్చినా వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మూడో దశ అనేది మొదలై విస్తరిస్తే విజయవాడ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: