కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సీఎంలతో మాట్లాడుతూ, పరిస్థితుల్ని తెలుసుకుంటూ, ముందుకెళుతున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నాయకులతో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వారి దగ్గర నుంచి సలహాలు కూడా తీసుకుంటున్నారు.

 

ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా మోదీకి సహకరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మోదీకి ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు. ఇప్పటికే కరోనాని కట్టడి చేయడానికి  పలు కీలక సూచనలు కూడా ఇచ్చారు. అలాగే తాజాగా దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ కేంద్రానికి విలువైన సూచనలు ఇవ్వడానికి, తమ పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయం వద్దని, ప్రధానికి పూర్తి మద్దతుగా ఉండాలని తమ పార్టీ నేతలతో చెబుతున్నారు.

 

అయితే రాహుల్ ఇలా ప్రధానికి హెల్ప్ చేస్తుంటే, కరోనాని కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలకు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సహకరించడం లేదు.  
ఇటీవల రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు, వైద్య సిబ్బందిపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఆరు కేంద్ర బృందాలను కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రాలకు పంపింది. 

 

ఇప్పటికే వారు ఆయా రాష్ట్రాలకు చేరుకున్నారు. అయితే వారు ఎందుకు వస్తున్నారో మోదీ, అమిత్ షాలు సరైన కారణం చెప్పాలని, కారణం చెప్పకుండా వస్తే, వారికి సహకరించే సమస్యే లేదంటూ మమత ఎదురుతిరిగారు. ఓ వైపు కేంద్రం పరిస్థితుల్ని సమీక్షించేందుకు పంపుతున్నామని చెబుతున్నా, మమత మాత్రం దాని వెనుక ఎదో రాజకీయ కోణం ఉందనుకుని వారికి సహకరించనని చెప్పేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో మమత ఇలా చేయడం సరికాదనే వాదనలు ఎక్కువ వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీనే రాజకీయాలు వద్దు అంటుంటే మమత మాత్రం ఇలా రాజకీయ కోణంలో ఆలోచించడం దురదృష్టకరమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: