బాపు.. ఈ పేరు తెలియని తెలుగు వారు చాలా అరుదనే చెప్పాలి.. నేరుగా బాపు ఎవరో తెలియకపోయినా.. బాపూ బొమ్మ అంటూ వచ్చే పాటల్లో అయినా ఆయన పేరు విని ఉండాల్సిందే. ఇంతకీ ఎవరీ బాపు.. ఆయన గొప్పదనం ఏంటి..? సాధారణంగా ఓ మనిషి గొప్పవాడైతే ఏదో ఒక రంగంలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు.. ఒక రంగంపై దృష్టి పెట్టి అందులో నిష్ణాతుడవుతాడు. కానీ.. మన హీరో బాపు అలా కాదు. ఆయన సకల కళా వల్లభుడు.

 

 

అవును మరి. కార్టూనిస్టుగా జీవితం ప్రారంభించిన బాపు.. బొమ్మలకు ప్రాణం పోశారు. తనదైన లైన్ అందుకున్నాడు. ఆ బొమ్మ చివరన బాపు అని సంతకం లేకపోయినా సరే.. ఆ బొమ్మ బాపుదే అని కాస్త కళాపోషణ ఉన్న ఎవరైనా ఇట్టే చెప్పేంతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. కార్టూన్లు, చిత్రాలు, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు.. ఇలా ఒకటేమిటి బొమ్మలపై బాపు చేసిన ప్రయోగాలెన్నో. బంగారానికి తావి అబ్బినట్టు చిత్రకారుడు బాపుకు రచయిత ముళ్లపూడి తోడయ్యాడు. ఇక వీరిద్దరూ కలిసి తెలుగు సాహిత్యంలో చేసిన ప్రయోగాలు ఎన్నో.

 

 

అక్కడితో ఆగారా.. ఎలాంటి అనుభవం లేకుండానే సినిమా దర్శకుడైపోయాడు బాపు. కృతకపు మాటలు, మూసకట్టు చిత్రీకరణతో సాగిపోతున్న తెలుగు సినీరంగాన్ని ఓ కుదుపు కుదిపి.. మార్పుకు సాక్షితో శ్రీకారం చుట్టాడు బాపు. పేరుకే బాపు సినిమా తీశాడు. కానీ అది అక్షరాలా బాపు గీసిన చిత్ర కావ్యమే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి సీనూ స్కెచ్‌ వేసుకుని మరీ తీస్తారు.

 

 

ఒకటా రెండా.. అలనాటి సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకూ బాపూ చేతిలో ప్రాణం పోసుకున్న సినిమాలెన్నో. బాపుతో వచ్చిన చిక్కే ఇది. ఏదో ఒక రంగం అంటే రాయొచ్చు. కానీ ఇన్ని రంగాల్లో ఇంతగా నిష్ణాతుడైన వాణ్ణి ఏమి వర్ణించేది.. ఎంతని చెప్పేది. ఆయనకు అటు కార్టూన్‌, చిత్ర రంగంలోనూ..ఇటు సినీ రంగంలోనూ ఎందరో ఏకలవ్య శిష్యులు. అంత కీర్తి ప్రతిష్టలైన ఎంత సున్నిత మనస్కులో.. ఎంతటి భక్తి ప్రపత్తులో.. అలాంటి మహా కళాకారుడు మళ్లీ పుడతాడా.. తెలుగు నేలకు గిలిగింతలు పెడతాడా.. పుట్టాలి.. బాపూ నువ్వు మళ్లీ పుట్టాలి. తెలుగు నేలపై నవ్వుల పువ్వులు విరబూయించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: