ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్నటివరకు రాష్ట్రంలో 722 కరోనా కేసులు నమోదు కాగా వీరిలో 92 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం రోజురోజుకు తగ్గుతోంది. 
 
ఆదాయం తగ్గడం వల్ల ఆ ప్రభావం పింఛన్లపై, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై పడుతోంది. రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం గత నెల రెండు విడతలుగా జీతాలు చెల్లిస్తామని ప్రకటన చేసింది. ఈ నెలలో ఆదాయం మరింత గణనీయంగా తగ్గడంతో ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడితే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో జీతాల్లో కోత దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకుంటే మాత్రమే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 
 
ప్రభుత్వం ఏప్రిల్ నెల జీతాల్లో కోత విధించక తప్పదని ప్రచారం జరుగుతోంది. మరి ప్రభుత్వం జీతాల్లో కోత విధిస్తుందా...? గత నెల మాదిరిగానే రెండు విడతల్లో జీతాలు చెల్లిస్తుందా..? తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. మరోవైపు రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. ఈ నాలుగు జిల్లాలలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 174 కేసులు నమోదయ్యాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: