తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 56 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కేసుల సంఖ్య తగ్గటంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఈరోజు మరలా కేసుల సంఖ్య పెరగడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలోనే 26 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు జిల్లాలోకి ఎవరికీ అనుమతించకుండా చర్యలు చేపడుతున్నారు. 
 
మరోవైపు జీ.హెచ్.ఎం.సీ పరిధిలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా 23 మంది మృతి చెందారు. ఈరోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 19 కరోనా పాజిటివ్ కేసులు, గద్వాలలో 2, నిజామాబాద్‌లో 3, ఆదిలాబాద్‌లో 2 కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం మే నెల 7 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవ్వకుండా ఉండటానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 
 
మరోవైపు ఏపీలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సీఎం జగన్ ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంపిణీ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: