కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుకు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది . అయినా శరవేగంగా  వైరస్ వ్యాప్తి చెందుతోంది . దీనితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.  కరోనా వ్యాప్తి నివారణకు   తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.  

 

సమీక్షలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.  హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని కేసీఆర్ , ఉన్నతాధికారులతో  సమీక్షించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని ఈ  సమావేశంలో నిర్ణయించారు. సిఎం ఆదేశం మేరకు సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేకాధికారి ని నియమించింది . జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే పరిణామం .

 

ఇక గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా  తగ్గుముఖం పట్టాయని భావిస్తోన్న కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం ఏకంగా 58 నమోదు కావడంతో పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు . సూర్యాపేట , హైదరాబాద్ నగరాల్లోనే 45  పాజిటివ్  కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాలో రెండు , మూడు చొప్పున నమోదయ్యాయి . కరోనా కట్టడికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ఎందుకు కరోనా కట్టడి కావడం లేదో తెలుసుకునేందుకే ఉన్నతస్థాయి అధికారులను క్షేత్రస్థాయి లో పర్యటించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: