ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దేశంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం జనం గుంపులుగుంపులుగా గుమికూడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నా... వేలకువేలు జరిమానా విధిస్తున్నా కొందరు అదే పనిగా రోడ్లపైకి వస్తున్నారు. 
 
మరి కేంద్రం లాక్ డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది...? అనే ప్రశ్నకు లాక్ డౌన్ ను కేంద్రం ఎత్తివేసినా ప్రజలు స్వచ్చంధంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించేందుకు సిద్ధమయ్యారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ప్రధాని మోదీ తొలి విడత లాక్ డౌన్ ప్రకటించక ముందే రోడ్లపై జన సంచారం తగ్గింది. కరోనా భయంతో ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
సాధారణంగా ఏది చూడొద్దంటే అదే చూడటం... ఏ పని చేయొద్దంటే అదే పని చేయడం మానవ నైజం కాబట్టి కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని... లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రం కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో వారే స్వచ్చందంగా జాగ్రత్తలు పాటిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన ప్రజలు రోడ్లపై గుంపులుగుంపులుగా పోగయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. 
 
ఇందుకు ఉదాహరణగా ఏపీలోని గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపులు విధించినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని.... తెలంగాణలోని హైదరాబాద్ లో మాత్రం కొంతమంది వాహనదారులు రోడ్లపైకి వస్తున్నారని చెబుతున్నారు. ప్రజలకు కరోనా గురించి రోజురోజుకు అవగాహన పెరుగుతోంది కాబట్టి లాక్ డౌన్ ను ఎత్తివేసినా ప్రజల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా రోజురోజుకు వేగంగా విజృంభిస్తూ ఉండటంతో మే 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ను మరోసారి పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: