సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. కానీ నేడు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ధరణీతలాన్ని అతలాకుతలం చేయడంతో భూగోళం అగ్గిమీద గుగ్గిలంలా మారుతోంది. సమాజంలో చాలామందికి భూమి పరిరక్షణ గురించి సరైన అవగాహన లేదు. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పరవాలేదు కానీ భూమికి హాని చేయకుండా ఉంటే చాలు. అందులో భాగంగా 1970 ఏప్రిల్ 22 నుంచి ధరిత్రీ దినోత్సవంను జరుపుకుంటున్నారు. 
 
సాధారణంగా భూమిపై ఉండే జంతువులు పుడమికి ఎలాంటి హాని చేయకపోయినా... మనుషులు టెక్నాలజీ, నాగరికత, ఫ్యాషన్లు అంటూ నీటిని, గాలిని, మట్టిని కలుషితం చేస్తూ భూమికి హాని చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎర్త్ డే ను జరుపుకుంటున్నారు. భూమి బాగుంటేనే రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుంది. ప్రకృతి నియమాలను విరుద్ధంగా మనిషి చేస్తున్న కొన్ని పనుల వల్ల భూమి వేడెక్కుతోంది. 
 
కొందరు రైతులు రసాయనాలను విచ్చలవిడిగా వాడుతూ భూమిని నిస్సారంగా మారుస్తున్నారు. రసాయనాల వాడకం వల్ల భూములు నిస్సారంగా, నిర్జీవంగా మారుతున్నాయి. దీర్ఘకాలంలో పంట ఉత్పత్తి తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారి తీస్తున్నాయి. మనం కొన్ని పనులు చేయడం ద్వారా భూమి పరిరక్షణకు మనవంతు కృషి చేయవచ్చు. 
 
పర్యావరణ సానుకూల ఉత్పత్తులను వినియోగించడం, రీసైక్లింగ్ చేసే బాటిల్స్, బ్యాగులను వాడటం, తక్కువ దూరాలకు కాలినడకన వెళ్లడం, రీసైక్లింగ్ కు అవకాశం ఉండేవాటిని ఎక్కువగా వాడటం, డిస్పోజబుల్ ప్యాకేజీలకు దూరంగా ఉండటం ద్వారా భూమిని కాలుష్యం భారీన పడకుండా కాపాడుకోవచ్చు. ధరిత్రికి కవచంలా ఉన్న ఓజోన్ పొరను గ్రీన్‌హౌస్ వాయువులు తూట్లుపొడుస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
కార్పొరేట్ శక్తుల అమిత లాభాపేక్ష, హద్దూ అదుపు లేని వినియోగ సంస్కృతి, ధనికుల జీవన శైలి, పర్యావరణాన్ని నష్టపర్చగల శాస్త్ర, సాంకేతికాల ఎంపిక, ప్రకృతి వనరులను కొల్లగొట్టే రాజకీయాలు, ఆక్రమణలు, అక్రమాల వల్ల భూమికి నష్టం చేకూరుతోంది. భూమికి ఎదురయ్యే దుష్ప్రభావాలను ఎదుర్కోవాలంటే మనం రీసైక్లింగ్ చేసే వాటిని మాత్రమే వినియోగించాలి. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదల స్థాయిని కనీస స్థాయికి తగ్గించాలి. చెట్లను పెంచి భూమి, నీరు వంటి మౌలిక వసతులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: