ఇప్పుడు అంద‌రి దృష్టి ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పైనే. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్త ప్రపంచం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గుండె శస్త్ర చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని  అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌తో పాటు మరికొన్ని నివేదికలు వెల్లడించిన కథనాలు సంచ‌ల‌నంగా మారాయి. అయితే, అస‌లు ఆయ‌న గుండెకు ఏమైంది? అనే విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

 

ఉత్తర కొరియా జాతిపిత, అత్యంత ప్రియమైన తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి ఏప్రిల్‌ 15న నిర్వహించగా, ఆ కార్యక్రమానికి ఆయన గైర్హాజరు అయ్యారు. ఇంతవరకూ ఎప్పుడూ అలా జరగలేదు. దాంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలకు ఇప్పుడు బలం ఏర్పడుతోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం,  చైనా సరిహద్దుల్లోని  మౌంట్‌ పయిక్టే అనే  పర్వతాన్ని కిమ్‌ వంశీయులు ప్రాణప్రదంగా భావిస్తుంటారు. ఈ ప‌ర్వాతాన్ని అధిరోహించిన సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆగస్టులో ఆ సంఘటన జరిగిందని తెలుస్తోంది. అప్పటి నుంచి అత్యంత రహస్యంగా చికిత్స చేయించుకుంటున్నారని, అయితే ధూమపానం, ఊబకాయంవల్ల ఆ వ్యాధి ముదిరి అస్వస్థతకు గురవడంతో ఆపరేషన్‌ చేశారన్నది ఓ మీడియా సంస్థ‌ కథనం వెలువ‌రించింది.   ఏప్రిల్‌ 12న ఆ శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం సీరియస్‌గా ఉందని తెలిపింది. హ్యాంగ్‌సాన్‌ కౌంటీలోని ఓ ఆస్పత్రిలో ఈ చికిత్స చేశారని కూడా చెబుతోంది. ప్రస్తుతం ఆయనను అక్కడినుంచి రహస్య ప్రాంతంలోని మౌంట్‌ విల్లాలో, రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు దూరంగా ఉన్నారన్నది కథనం. 

 

కాగా,  కిమ్‌ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు ఓ అమెరికా ఉన్నతాధికారి చెప్పారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కాగా, కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించి  ఎలాంటి సమాచారం లేదని దక్షిణ కొరియా తెలిపింది.  మరోవైపు, తమ అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఉత్తరకొరియా తోసిపుచ్చింది. కిమ్‌ గైర్హాజరుకు రకరకాల కారణాలను ఊహించటం అసమంజసమని ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: