కర్నూలు జిల్లా నంద్యాలలోని మాతాశిశు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం శిశువు ప్రాణం తీసింది. జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి పురిటి నొప్పులతో వచ్చిన మహిళ విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శిశువు తల తల్లి కడుపులోనే ఉండిపోయింది. శిశువు మొండేన్ని బయటకు తీసిన డాక్టర్లు ఎంత ప్రయత్నించినా శిశువు తలను బయటకు తీయలేకపోయారు. దీంతో మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. 
 
డాక్టర్లు ఏం చేయాలో పాలుపోక వెంటనే మహిళను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నంద్యాలలోని మాతాశిశు వైద్యశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా మిడుతూరు మండలం అళగనూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి నిన్న ఉదయం పురిటినొప్పులు రావడంతో నంద్యాలలోని మాతాశిశు వైద్యశాలలో చేరింది. వైద్యులు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని సిజేరియన్ చేసి శిశువును బయటకు తీయాలని చెప్పారు. 
 
మహిళ కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తల నుంచి మొండెం వేరు అయి శిశువు చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. విషయం తెలిసిన మహిళ కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. 
 
విషయం తెలుసుకున్న ప్రజాసంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఆస్పత్రి వైద్యులు మాత్రం ఈ ఘటనలో తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. బిడ్డ ఎదురుకాళ్లతో పుట్టడం వల్ల మొండెం నుంచి తల వేరు అయిందని తమ తప్పు లేదని చెబుతున్నారు. లక్ష్మీదేవికి గతంలోనే ఒకసారి అబార్షన్ కాగా మరోసారి ఇలా జరగడంతో ఆమె మానసికంగా కుంగిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  ఉన్నతాధికారుల విచారణ అనంతరం ఈ ఘటనలో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: