కరోనా ప్రభావం.. లాక్ డౌన్ కష్టాలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీపై గోరు చుట్టుపై రోకటిపొటులా తయారైంది లాక్ డౌన్. 20వ తేదీ దాటడంతో జీతాలు.. ఫించన్లు.. ఇతర ముఖ్యమైన ఖర్చులకు నిధులు సర్దాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం చూస్తే.. ఆర్థిక శాఖ అధికారులు గుండెలు గుభేలుమంటున్నాయి. వేయి కోట్ల రూపాయల మేర దాటాల్సిన ఆదాయం ప్రస్తుతం 80-90 కోట్ల రూపాయలకు పరిమితం అయిపోయింది. దీంతో జీతాల చెల్లింపులు కూడా కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏం చేయాలనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

 

అసలే ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న ఏపీ.. లాక్ డౌన్ వల్ల మరింత ఆర్థిక సంక్షోభంతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం లెక్కలు చూసి ఆర్థిక శాఖ అధికారులకు చెమటలు పడుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 20వ తేదీ నాటికి 1500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది. అంటే గత ఏడాది ఇదే ఏప్రిల్ నెలలో సెలవు దినాలు పోనూ రోజుకు సుమారు 125 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చేది. ఈ ఏడాది ఆ ఆదాయం రోజుకు 150 కోట్ల రూపాయల మేర వస్తుందని సర్కార్ అంచనా వేసుకుంది. కానీ లాక్ డౌన్ కారణంగా సీన్‌ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు రోజుకు ఏడు కోట్ల రూపాయల ఆదాయం రావడం కూడా కష్ట సాధ్యంగా మారిందని ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీని బట్టి చూస్తే.. ఇప్పటి వరకు ప్రభుత్వ ఖజానాకు కేవలం 85 నుంచి 90 కోట్ల రూపాయలు మాత్రమే చేరినట్టు సమాచారం. దీంతో ఆర్థిక శాఖ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

 

ఓవైపు ఆదాయం ఈ స్థాయిలో పడిపోతుంటే.. ఖర్చులు మాత్రం కొండలా పెరిగిపోతున్నాయి. జీతాలు, ఫించన్లు.. సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నింటికో డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి. జీతాలు.. ఉద్యోగుల ఫించన్లలో కొంత మేర కోత విధిస్తున్నప్పటికీ మిగిలిన మొత్తాలను సర్దుబాటు చేయక తప్పదు. కానీ ఇప్పుడు ఆ కొద్దిపాటి మొత్తాలను కూడా చెల్లించేందుకు సరిపడా నిధులు అందుబాటులో లేవు. దీంతో నిధుల సమీకరణ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కన్పిస్తోంది. ఈ మేరకు రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నెల 17వ తేదీ నాటికే 6 వేల కోట్ల రూపాయల మేర రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ వేలం ద్వారా రుణం తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల ఒకటో తేదీన వేయి కోట్లు.. ఎనిమిదో తేదీన మూడు వేల కోట్లు అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే వివిధ మార్గాల నుంచి మరికొంత అప్పు తెచ్చినట్టు సమాచారం. ఈ నెల 24వ తేదీన మరికొంత అప్పు తీసుకుంటే తప్ప జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. వివిధ కార్పోరేషన్ల ద్వారా కూడా రుణాలను సమీకరించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఇప్పటికే కొంతమేర నిధులను సమీకరించిన ప్రభుత్వం.. మరోసారి ఈ కార్పోరేషన్లను వాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి సదురు కార్పోరేషన్లకు సూచనలు వెళ్లినట్టు సమాచారం.

 

అప్పులు తీసుకోవడం ద్వారా తాత్కాలికంగా నిధుల లభ్యత పెంచుకునే ప్రయత్నం చేసినా.. దీర్ఘకాలంలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు.. ఆదాయాలను పెంచుకునేందుకు మరిన్ని మార్గాలను అన్వేషిస్తోంది ప్రభుత్వం. పన్నుల పరిధిని మరిన్ని రంగాలకు విస్తరించడం.. ప్రజలపై భారం పడకుండా పన్నులు వేసే రంగాలను గుర్తించడం వంటి వాటిపైనా ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: