కరోనా వైర‌స్‌పై ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ అండ‌గా నిలిచారు. కుటుంబాల‌కు దూరంగా ఉంటూ దేశం కోసం పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. డాక్ట‌ర్ల‌పై జరుగుతున్న దాడులను ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ మేర‌కు చరిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇంట్లో బుధవారం కేంద్ర కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించి ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైద్యులపై దాడుల‌ను ట‌చ్ చేయాలంటేనే భ‌య‌ప‌డేలా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు చేయ‌నుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండేలా దీనిని రూపొందించ‌నున్నారు. స‌మావేశం అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈ వివరాలు వెల్లడించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే కేవ‌లం 30 రోజుల్లో విచార‌ణ చేప‌ట్టి ఐదు నెలల నుంచి ఏడేళ్ల‌ వరకూ జైలు శిక్ష విధిస్తామని వెల్ల‌డించారు. అంతేగాకుండా.. నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

 

 వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని హెచ్చ‌రించారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని మంత్రి జ‌వ‌దేక‌ర్‌ అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. అంత‌కుముందు కూడా కేంద్ర‌మంత్రి అమిత్‌షా కూడా వైద్యుల‌కు భ‌రోసా ఇచ్చారు. వైద్యుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. త‌మిళ‌నాడుతోపాటు ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన దాడుల‌కు నిర‌స‌న‌గా ఈ రోజు వైద్యులు స్ట్రైక్ చేయాల‌ని నిర్ణ‌యించి అమిత్‌షాకు లేఖ రాశారు. దీనిపై వెంట‌నే ఆయ‌న స్పందించారు. మీకు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. ఆ వెంట‌నే కేంద్ర‌మంత్రివ‌ర్గం స‌మావేశంలో ఏకంగా ఆర్డినెన్స్ తీసుకోవ‌డంతో వైద్య‌వ‌ర్గాల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: