చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకుంది. ఈ వైరస్ పుట్టుక గురించి పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా దేశం కరోనా విజృంభిస్తున్న సమయంలో మీడియాపై కూడా ఆంక్షలు విధించింది. అందువల్ల కరోనా బాధితుల, మృతుల గురించి వాస్తవాలు వెలుగులోకి రాలేదు. 
 
అయితే తాజాగా చైనా అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని పొందిన రచయిత్రి ఫాంగ్‌ఫాంగ్ చైనా వుహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసిన తరువాత అక్కడ ఏం జరిగింది...? అనే విషయాలను ఆన్ లైన్ డైరీలో పొందుపరిచారు. ఆ రచయిత్రికి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 64 ఏళ్ల రచయిత్రి రాసిన ఈ నవల వివిధ దేశాల్లో అనువాదం అవుతోంది. దీంతో చైనా ఆ రచయిత్రిపై ఫైర్ అయింది. 
 
ఈ డైరీ కరోనా వైరస్ గురించి చైనా నిజాలు చెప్పలేదనే ఆరోపణలకు ఆజ్యం పోసేలా ఉంది. రచయిత్రి డైరీలో 2019 చివరిలో చైనాలో కరోనా వ్యాప్తి చెందిందని... 2020 జనవరి 23న చైనా లాక్ డౌన్ విధించిందని పేర్కొంది. కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని తమకు ముందే తెలుసని... ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఆ విషయం వెల్లడించినా వారు పట్టించుకోలేదని ఒక వైద్యుడు చెప్పారని ఆమె పేర్కొంది. 
 
రచయిత్రి డైరీలో కొన్ని సున్నితమైన అంశాలను సైతం పొందుపరిచారు. అయితే రచయిత్రి వాస్తవాలను వెల్లడించడంపై చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచయిత్రి ధైర్యంపై విదేశాలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ డైరీ వల్ల అమెరికాకు చైనాకు మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వం ఆమెను చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: