ఏపీలోనూ క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో 813 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొదటి నుంచి కరోనా కేసుల ట్రేసింగ్ పక్కాగా జరుగుతోంది. ఎక్కడ నుంచి ఎవరు వస్తున్నారు.. ఎవరికి ఎవరి నుంచి కరోనా వచ్చింది అన్న వివరాలు పక్కాగా నమోదు చేస్తున్నారు. దీని వల్ల కాంటాక్టు కేసులను అరికడుతూ వచ్చారు.

 

 

అయితే ఇప్పుడు మిస్టరీ ఏంటంటే తాజాగా కరోనా ఎలా సోకిందో తేలని పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 52 ఉన్నాయట. ఈ విషయాన్ని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈ కేసుల మూలాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లివచ్చిన వారో.. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారో.. లేక.. పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ ఉన్నవారికో కరోనా పాజిటివ్ వచ్చింది.

 

 

కానీ ఇప్పుడు ఎలా వచ్చిందో తెలియని కేసులు ఏకంగా 50కి పైగా ఉన్నాయంటే..ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. ఒక వేళ ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ కారణంగా వచ్చి ఉంటే.. అది చాలా డేంజర్ సిగ్నల్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ విషయంపైనే ఏపీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యాధికారితో కూడిన బృందంతో సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నట్లు చెప్పారు.

 

 

ఇక 177 కేసులు నమోదైన గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ర్యాపిడ్ కిట్ల వినియోగం తాత్కాలికంగా నిలిపివేయాలని ఐసీఎంఆర్ ఆదేశించినందున ప్రత్యేక యంత్రాలు తెప్పించినట్లు మంత్రి మీడియాకు చెప్పారు. మరో వైపు రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: