గత నాలుగైదు రోజుల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై వీరు ఒకరిపై ఒకరు విమర్సలు చేసుకుంటున్నారు. కరోనా టెస్ట్ కిట్లలో జగన్ ప్రభుత్వం కమిషన్ కొట్టేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్ గా విజయసాయిరెడ్డి... కన్నా , చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయారని తీవ్ర ఆరోపణ చేశారు.

 

ఇక ఇక్కడ నుంచి విజయసాయికి, బీజేపి నేతలకు తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. విజయసాయి ఓ బ్రోకర్, జైలు పక్షి, చీకట్లో చిల్లర లెక్కలు వేసుకునే వారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే కన్నా కూడా ఆ విమర్శలని ఖండిస్తూ, విజయసాయి కాణిపాకం గుడిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దానికి విజయసాయి కూడా స్పందిస్తూ, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, కన్నా 20 కోట్లకు అమ్ముడుపోయారని మళ్ళీ చెబుతున్నానని, కాణిపాకం ఎప్పుడు వెళదాం అంటూ కన్నాకు పంచ్ ఇచ్చారు.

 

ఈ క్రమంలోనే బీజేపీ నేతలు వరుస పెట్టి వచ్చి, ఓ టీడీపీ అనుకూల మీడియా ద్వారా విజయసాయిపై విమర్సలు గుప్పిస్తున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే బీజేపీలో పేరు లేని నాయకులు కూడా వచ్చి విజయసాయిపై  విమర్సలు చేస్తున్నారు. ఇక కొందరు నేతలైతే నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారు.  విజయసాయికి విషయం, వివరం లేవని లంకా దినకర్ లాంటి వారు విమర్శలు చేస్తున్నారు.

 

అలాగే సీఎం జగన్ ని ఉద్దేశించి కనకపు సింహసనంపై శునకాన్ని కూర్చోబెట్టడమే సమాజానికి చేటు అని, ఇంకా అది పిచ్చి కుక్క అయితే లాక్‌డౌన్ నిబంధనలను కాలరాస్తూ, అరుస్తూ, కరుస్తూ ఊరిమీద పడి విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తుందని నోటికొచ్చిన విధంగా సంస్కారం లేకుండా మాట్లాడేశారు. మొత్తానికి  ఓ మీడియాని అడ్డంపెట్టుకుని బీజేపీ నేతలు, జగన్, విజయసాయిలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: