కరోనా వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాకు జన్మస్థానమైన వుహాన్ లో వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయిన వారికి మరలా కరోనా నిర్ధారణ అవుతోంది. కరోనా సోకిన వారిలో లక్షణాలు కూడా కనిపించకపోవడంతో వైద్యులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొందరికి మొదట కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్లిన 70 రోజులకు పాజిటివ్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. 
 
కొంతమందిలో 50 నుంచి 60 రోజులకే కరోనా నిర్ధారణ అవుతోందని చెబుతున్నారు. చైనాకు చెందిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరిలో తాను మూడుసార్లు పరీక్షలు చేయించుకున్నానని అప్పుడు కరోనా నెగిటివ్ వచ్చిందని.... ప్రస్తుతం కరోనా లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అనేక దేశాల్లో 14 రోజుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు భావిస్తున్నారు. 
 
అయితే కొంతమందిలో దాదాపు కరోనా సోకిన 70 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం. మరికొంతమందికి కరోనా నయమైనా మరలా 70 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తున్నాయి. చైనాలో ఇలా 70 రోజుల అనంతరం కరోనా భారీన పడిన వారు చాలా మందే ఉన్నారని  సమాచారం. ఇటలీ, దక్షిణ కొరియా దేశాలలో రెండోసారి కరోనా భారీన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
ఝాంగ్ సన్ ఆస్పత్రి ఉపాధ్యక్షుడు యువాన్ యుఫెంగ్ సార్స్ సమయంలో తాము ఇలా కావడం చూడలేదని... కరోనా వైరస్ గురించి తమకు కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు. మరికొందరు వైద్యులు కరోనా గురించి తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత అని కామెంట్లు చేస్తున్నారు. అయితే రెండోసారి కరోనా భారీన పడిన వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలు లభించడం లేదని వైద్యులు చెబుతున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: