ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 19 కొత్త కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 203కు చేరింది. అధికారులు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరగడానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కారణమని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 
 
కరోనా వల్ల కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మధ్య గత కొన్ని రోజుల నుంచి మాటల యుద్ధం జరుగుతోంది. అఖిల ప్రియ కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి హఫీజ్ ఖాన్ కారణమని ఆరోపణలు చేసింది. అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. అఖిల ప్రియకు కౌంటర్ ఇవ్వడంతో పాటు సవాల్ విసిరారు. 
 
అఖిల ప్రియ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని అన్నారు. తన వల్ల, ఎంపీ సంజయ్ వల్ల కరోనా వ్యాప్తి చెందిందని నిరూపిస్తే కర్నూలు సెంటర్ లో ఉరి తీయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల ప్రియ తన సవాల్ కు సిద్ధమా అంటూ ఆయన ప్రశ్నించారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించటానికి తాను ఎంతో కష్టపడ్డానని హఫీజ్ ఖాన్ చెప్పారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి ఇంటింటికీ వెళ్లి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లాలని చెప్పారు. 
 
అవగాహన లేకుండా అఖిల ప్రియ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కరోనా కష్ట కాలంలో రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు జిల్లాలో రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని కర్నూలు, నంద్యాల ప్రాంతాలలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: