క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై మ‌రోసారి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని హెచ్చ‌రించింది. క‌రోనా వైర‌స్ మాన‌వాళిని నీడ‌లా వెంటాడుతుంద‌ని, అది ఇప్ప‌ట్లో మన‌ల్ని విడిచిపోద‌ని పేర్కొంది. కొవిడ్‌-19ను కొన్ని దేశాలు త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నాయ‌ని, వైర‌స్ అదుపులోకి వ‌చ్చింద‌న్న భావ‌న‌లో ఉన్నాయ‌ని, కానీ.. దానిని అలా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం స‌రికాద‌ని చెప్పుకొచ్చింది. వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకుంటున్న త‌రునంలో మ‌ళ్లీ పుంజుకోవ‌డాన్ని అనేక దేశాల్లో చూస్తున్నామ‌ని, మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ వెల్లడించారు. ఏ చిన్న త‌ప్పు కూడా చేయొద్ద‌ని, దానిని ఎదుర్కొనేందుకు నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. నిజానికి.. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 50కిపై దేశాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌లో అమ‌లులో ఉంది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు దారుణంగా దెబ్బ‌తింటున్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా కొద్దిమేర‌కు త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్న భావ‌న‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను ఎత్తేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాయి. ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

 

నిజానికి.. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డంలో అనేక దేశాలు ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్నాయ‌ని,  రానున్న రోజుల్లో ఆఫ్రికా, అమెరికా త‌దిత‌ర దేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత‌గా రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిస్తోంది.  ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపిస్తున్నా..  ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో ఈ వైరస్‌ తీవ్రతపై డ‌బ్ల్యూహెచ్‌వో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను  సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్ తిప్పికొట్టారు. కరోనా ప్ర‌మాదాన్ని ముందే గుర్తించి, డబ్ల్యూహెచ్‌వో జనవరి 30వ తేదీనే అంతర్జాతీయ అత్యయికస్థితి ప్రకటించిందని ఆయ‌న పేర్కొన్నారు. అప్ప‌టికీ క‌రోనాను ఎదుర్కొనేందుకు స‌మ‌యం ఉన్నా.. అనేక దేశాలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. కరోనా వైరస్‌ క‌ట్ట‌డిలో సరిగా వ్యవహరించని కారణంగా డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేయాలని అమెరికా చేసిన వ్యాఖ్యలను టెడ్రోస్‌ తిరస్కరించారు.  ఇదే స‌మ‌యంలో డబ్ల్యూహెచ్ఓకు నిధుల నిలిపివేతపై నిర్ణయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుందని టెడ్రోస్‌ అశాభావం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: