రోడ్డెక్కితే గానీ వారిది పూట గడవని పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోవడంతో.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. తెలంగాణలో ఆటోవాలాల కష్టాలు చూస్తే కన్నీళ్లాగక మానవు.

 

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు చేసిన లాక్‌ డౌన్ కారణంగా దేశమంతా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆటోల మీద ఆధారపడి జీవించే వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆటోలే జీవనాధారంగా నడిచే కుటుంబాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో సుమారు 2 లక్షల ఆటోలున్నాయి. ఈ ఆటోల ద్వారానే సగానికి పైగా ప్రజలు రోజు తమ తమ గమ్యాలను చేరుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఆటోలన్నీ ఇంట్లోనే ఆగిపోయాయి.. దాంతో ఆటోవాళ్లు వాళ్ల సాధారణ జీవనంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఆటోల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే ఒక్కో ఆటో పై ఇద్దరు కార్మికులు జీవిస్తున్నారు. పగటి వేళలో ఒకరు... రాత్రి సమయాల్లో మరొకరు ఆటోను నడుపుకుని జీవితం గడిపే వారు ఉన్నారుఉ. ఇలా ఆటోల సంఖ్య కంటే ఎక్కువగానే కార్మికులు వీటిపై ఆదారపడి జీవనం వెళ్లదీస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆటోవాళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నగరం విడిచి సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్నా వెళ్లలేని పరిస్థితి. దాంతో చాలామంది సిటీలోనే ఉండిపోయారు. చేతిలో రూపాయి ఆదాయం కూడా అందకపోవడంతో.. ఆటో వాలా ల జీవితం ఇబ్బందికరంగా మారిపోయింది. ఇళ్లుగడవటం ఒక ఎత్తయితే ఇంటి అద్దెలు చెల్లించటం కూడా భారంగానే మారిపోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని విన్నపం 
లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రంతో పాటు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం.. నగదు ప్రజల అకౌంట్లలో జమ చేస్తున్నాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఆటోవాలను ఆర్థికంగా ఆదుకుంటోంది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ లోని ఆటో వాలాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా సాయం చేసి ఆదుకోవాలని  కోరుతున్నారు. ఆటో నడుస్తునే మా బతుకు బండి కూడా నడుస్తుందని.. లేకపోతే ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని అంటున్నారు. అందుకే తమకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నారు. సొంత ఊళ్లో అయితే ఏదో ఓ రకంగా పూట గడిచేదని.. కానీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా పల్లె నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వారికి కుటుంబ పోషణతో పాటు.. బతుకునీడ్చటం కూడా కష్టంగానే ఉందంటున్నారు ఆటో కార్మికులు.

 

భాగ్యనగరంలో ఆటో డ్రైవర్లలో కేవలం ప్రజా రవాణా ఒక్కటే కాదు.. అటు గూడ్స్ సరఫరా చేసే వారు కూడా ఉన్నారు. నిత్యం ఉదయం స్కూల్స్ కి విద్యార్ధులను తీసుకెళ్లడం.. సాయంత్రం పిల్లల్ని తిరిగి స్కూల్ నుంచి ఇంటి వద్ద డ్రాప్ చేయటంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  కూడా చేస్తుంటారు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ మూత పడటం.. ప్రజలు బయటికి రాకపోవడం.. ఆటోలు రోడ్డెక్కడానికి ఇంకా సమయం ఉండడంతో.. అన్నీ దారులు మూసుకుపోయాయి. తమకొచ్చే రోజువారి ఆదాయం నిలిచిపోయింది. దాంతో ఆటో కార్మికులు ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలొల బియ్యం... 1500 రూపాయలు అందిస్తోంది. ఇవి ఆటో కార్మికులకు కొంత ఊరటగానే ఉన్నాయి. కానీ ఆర్ధిక బారం నుంచి బయటపడటానికి ప్రభుత్వ చేయూత కావాలన్నది వారి మాట. 

 

ఆటో కార్మికులకు వచ్చే మూడు నెలల వరకు గడ్డుకాలమే! 
ఒకవేళ అనుకున్న సమయానికి లాక్ డౌన్ ముగిసిపోయి.. ప్రజారవాణా మొదలైనా.. స్కూల్ విద్యార్ధుల మీద ఆధారపడిన ఆటో డ్రైవర్లకు మాత్రం దాదాపుగా వచ్చే మూడు నెలల వరకు ఆర్ధిక ఇబ్బందులు తప్పేలా లేదు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు స్కూల్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి. వచ్చే జూన్ నాటికి కూడా స్కూల్స్ పరిస్ధితి ఇలాగే ఉండనుంది. దీంతో ఆటో కార్మికులకు వచ్చే మూడు నెలలు గడ్డుకాలమనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ రిత్యా ఇప్పటికే అన్నీ ఇఎమ్ఐలను మూడు నెలల వరకు కట్టొద్దని ప్రకటించింది. కానీ ఆటోవాలలు మాత్రం  ఫైనాన్సర్ల నుంచి ఓ ఆరు నెలల పాటు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

కరోనా వ్యాప్తిని బట్టి లాక్ డౌన్ లో సడలింపులు ఉండొచ్చు లేదా ఇంకా పొడగించొచ్చు. అయితే ఈ సమయంలో తమ బతులకు భరోసా ఏంటని మదనపడుతున్నారు ఆటోవాలాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: