స్వర్ణకారుల జీవితం దుర్భరంగా మారింది. చేసేందుకు పని లేక ఆదుకునే నాథుడు లేక అర్ధాకలితో జీవితాలను నెట్టుకువస్తున్నారు.  లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో నెల రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నారు. 

 

లాక్‌ డౌన్‌తో విశాఖ జిల్లాలో స్వర్ణకారుల పనులు ముందుకు కదలడం లేదు. ఇంతకు ముందులా ఇప్పుడు ఆర్డర్లు లేవు. దానికి తోడు పెళ్ళిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో నెల రోజుల నుంచి రూపాయి ఆదాయం లేక అర్ధాకలితో అవస్థలు పడుతున్నారు. తమను అంతో ఇంతో ఆదుకునే పెళ్లిళ్ల సీజన్‌లో కూడా పస్తులుండాల్సిన దుస్థితితో తమ జీవితాలు తయారయ్యాయని వాపోతున్నారు స్వర్ణకారులు. ఇప్పటికే 'బడా షాపులు, జ్యువెలరీ మాల్స్‌ తమ నోటి వద్ద కూడు లాగేశాయి అనీ.. ఇప్పుడు లాక్‌డౌన్‌ మా బతుకులను రోడ్డు పాలు చేసింది అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.  

 

సాధారణంగా మార్చి నుండి మే వరకు పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఓ మోస్తారు ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు కనీసం మంగళసూత్రం చేయించుకోవడానికి కూడా ఎవరు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బంగారు ఆభరణాలు తయారుచేసే దుకాణాలు కూడా మూతపడ్డాయి. అక్కడ కూడా పనిచ్చే వారు లేరు. నెల రోజుల నుంచి ఇళ్లకే పరిమితం కావడంతో జీవన భృతి లేక పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లాక్‌డౌన్‌ ఇప్పటికిప్పుడు ఎత్తేసినా తమకు చేతినిండా పని దొరికే పరిస్థితి వుండదని, మళ్లీ కుదుటపడేందుకు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. 

 

విశాఖలో పది వేల కుటుంబాలు కు పైగా బంగారం వస్తువులు తయారుచేసేవారు ఉన్నారు. వారందరికీ ఈ పని తప్పితే ఇంక వేరే పని తెలియదు. ప్రస్తుతం వీరెవరికీ ఉపాధి లేకుండా పోవడంతో తమని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరోనా దెబ్బకు స్వర్ణకారుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: