ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు 80 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 893కు చేరింది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం కొన్ని సేవలపై సడలింపులు ఇచ్చింది. కొన్ని సేవలపై మాత్రం ప్రభుత్వం మే 3వ తేదీ వరకు నిషేధం విధించింది. 
 
ఏపీ ప్రభుత్వం మే 3వ తేదీ వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. రక్షణ అవసరాలకు తప్పించి ఇతర అన్ని రైలు ప్రయాణాలపై నిషేధించింది. ప్రజా రవాణా వ్యవస్థలోని బస్సులపై నిషేధం విధించింది. అత్యవసర వైద్య పరీక్షలు మినహాయించి జిల్లాలు, రాష్ట్రాల మధ్య వ్యక్తుల రాకపోకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అన్ని విద్యా సంస్థలపై, ట్రైనింగ్, కోచింగ్ సంస్థలపై నిషేధం కొనసాగనుంది. 
 
ప్రత్యేక అనుమతి పొందిన పరిశ్రమలు మినహా మిగతా వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. అనుమతించిన సేవలు మినహా మిగతా అన్ని సేవలపై నిషేధించింది. రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ సర్వీసులపై మే 3 వరకు నిషేధం కొనసాగనుంది. అంత్యక్రియలు జరిపే సమయంలో కేవలం 20 మంది వరకే పరిమితి విధించింది. మత సంబంధమైన ప్రదేశాలు, ప్రార్థనలపై నిషేధం విధించింది. 
 
రాజకీయ, క్రీడా, సామాజిక కార్యక్రమాలు, మతపరమైన కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధించింది. థియేటర్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెస్ లపై నిషేధం విధించింది. మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు, గుంటూరు  జిల్లాల్లో 400కు పైగా కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాల ప్రజలు కరోనా పేరు వినబడితే చాలు గజగజా వణికిపోతున్నారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: