దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. గత నెల 22వ తేదీన ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్రం నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జనతా కర్ఫ్యూ రోజు నుంచి మద్యం షాపులు మూతబడ్డాయి. 
 
కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. లాక్ డౌన్ అమలు వల్ల మందుబాబులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పలు ప్రాంతాల్లో మద్యం దొరకక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కొందరు మందుబాబులు వింతగా ప్రవర్తిస్తున్నారు. అయితే మద్యం దొరక్కపోవడంతో కొందరు మందుబాబులు మాత్రం కొత్త రూట్లను ఎంచుకుంటున్నారు. 
 
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నాటుసారా విక్రయాలకు అనుమతులు ఇవ్వడంతో కొందరు అక్కడినుంచి నాటుసారా కొనుగోలు చేసి ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలలో విక్రయిస్తున్నారు. తాజాగా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల తనిఖీల్లో కూరగాయల రవాణా పేరు చెప్పి సారా ప్యాకెట్లను రవాణా చేస్తున్న ఒక వ్యాన్ పట్టుబడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతున్నారు. 
 
మరోవైపు పలు ప్రాంతాల్లో శానిటైజర్ల నుంచి ఆల్కహాల్ తయారు చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి మందు తయారు చేస్తున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల మద్యం షాపుల్లోనే దొంగతనాలు జరుగుతున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గకపోవడంతో మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మోదీ ప్రకటించిన లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు, సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: