ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ జిల్లాలను అతలాకుతలం చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి విజయనగరం జిల్లాను మాత్రం టచ్‌ చేయలేకపోతోంది. అయితే... తాజా పరిణామాలతో జిల్లా వాసులు కూడా వణికిపోతున్నారు. గ్రామాల్లోకి భారీగా వస్తున్న వలసదారులను చూసి హడలిపోతున్నారు. 


 
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన జిల్లా విజయనగరం. ఈ జిల్లా నుంచి వేలాది మంది పనుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఇతర జిల్లాలో పని కోసం వలస వెళ్లిన కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పనులు లేక, తినడానికి తిండిలేక జిల్లా నుంచి వలస వెళ్లిన వారంతా రోడ్డున పడ్డారు. చేరదీసే నాథుడే లేకపోవడంతో అంతా కలిసి  విజయనగరం జిల్లాకు తిరుగు పయనం అయ్యారు. గత నాలుగైదు రోజులుగా వందల మంది కార్మికులు నడకదాకరిలో..రహదారులు గుండా..అక్రమ మార్గాల్లో విజయనగరం జిల్లాకు చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

 

మరోవైపు...ఏపీలో పదకొండు జిల్లాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. విజయనగరం జిల్లా మాత్రం ప్రస్తుతానికి సేఫ్‌జోన్‌లో ఉంది. ఇప్పటి వరకు కరోనా నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పక్క జిల్లా, రాష్ట్రాల నుంచి ఎవరూ రాకుండా  చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే...వలస కూలీలు మాత్రం అక్రమ మార్గాల్లో కాలి నడకన జిల్లాలోకి వస్తున్నారు. చెన్నై, విజయవాడ, వైజాగ్ నుంచి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. మరికొందరు ఇతర వాహనాల ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. జిల్లా యంత్రాంగం వీరు గ్రామాల్లోకి వచ్చినా చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తోంది. బయట నుంచి వచ్చిన వారు గ్రామాల్లో మిగిలిన ప్రజలతో కలియ తిరుగుతున్నారు.

 

అయితే...సొంత గ్రామస్థులు కావడంతో స్థానికులు వారిని హెచ్చరించలేకపోతున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న రెడ్ జోన్ల నుంచి అనేక మంది వస్తున్నట్లు  జిల్లా ప్రజలు అధికార యంత్రాంగానికి సమాచారం ఇస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది మాత్రం ఈ విషయంలో సరిగా పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. బయటి నుంచి జిల్లాలోకి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచాలని కచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో 58 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నాలుగు వేల మంది ఉండే విధంగా సిద్దం చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 164 మందిని మాత్రమే క్వారంటైన్లో ఉంచారు. జిల్లాకి రోజూ వందల మంది వస్తున్నా వారిని క్వారంటైన్‌కి పంపించకుండా ఇంట్లో ఉండాలంటూ సలహా ఇచ్చి వెళ్లిపోతున్నారు. దీనిపై మండిపడుతున్నారు గ్రామీణ ప్రజానీకం. బయట నుంచి వచ్చిన వారు గ్రామాల్లో ఇంటి పట్టున ఉండకుండా ఇష్టానుసారం తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా పొరపాటున కరోనా సోకితే..తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

 

ఇప్పటికైనా...అధికారులు బయట నుంచి వచ్చే వారిని ఎక్కడికక్కడే నియంత్రించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచాలని సూచిస్తున్నారు. పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తరువాతే గ్రామాల్లోకి పంపించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు లేని జిల్లాగా ఉన్న విజయనగరంను ఇక ముందు కూడా ఇలాగే ఉండేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: