ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వ‌రం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో కొన్ని తీపి క‌బుర్లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా దిగ్బంధంలో ఉన్న వివిధ దేశాలు లాక్‌డౌన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాయి. వివిధ దేశాల్లో ప‌రిమిత స్థాయిలో, కొన్ని దేశాల్లో పూర్తిగా స‌డ‌లింపు ఇస్తున్నారు. ఫ్రాన్స్‌లో మెక్‌డొనాల్డ్‌ షాపులు తెరుచుకోవడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. బెర్లిన్‌లో బుధవారం ఆంక్షలను సడలించారు. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. నెల రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న సెర్బియాలో బుధవారం మార్కెట్లు, దుకాణాలు తెరుచుకున్నాయి. విక్రయదారులంతా మాస్కులు, గ్లౌజులు ధరించారు. 65 ఏండ్లకు పైబడిన వారిని వారానికి మూడు రోజులు పనులకు వెళ్లేందుకు అనుమతించారు. జార్జియా, సవన్నాలో జిమ్‌లు, సెలూన్‌లు ఈ వారంలో తెరుచుకొంటాయని గవర్నర్‌ బ్రెయిన్‌ కెంప్‌ ప్రకటించారు. స్పెయిన్‌లో వచ్చే వారం నుంచి చిన్నపిల్లలు బయటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

 


కాగా, వినియోగదారులు, వర్కర్లు వైరస్‌ భయంతో ఇళ్ల‌కే పరిమితం కావడంతో ఆశించిన ఫలితం రాలేదని అంటున్నారు. దుకాణం తెరిచినందుకు సంతోషంగానే ఉన్నా...కొందరు వైరస్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదికి వస్తే వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం ఉంద‌ని...వైరస్‌ను కట్టడి చేయకుండా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, వచ్చే ఏడు నెలల పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోకుండా, పలు చర్యలు మాత్రం తీసుకుంటే చాలు.. నవంబరు నాటికి దేశంలో 60% మందికి కరోనాకు ఇమ్యూనిటీ వస్తుందని హెర్డ్‌‌ ఇమ్యూనిటీ పేరుతో నూత‌న వైద్య చికిత్స‌ను ప్ర‌తిపాదించిన వారు చెప్తున్నారు. ఇటలీ, తదితర యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో 65 ఏళ్లలోపు వారే 93.5% ఉన్నారని, అందువల్ల ఇక్కడ మరణాల ముప్పు చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఈ స్ట్రాటజీ అమలు చేయకపోతే, వచ్చే ఏడాది జూన్ వరకూ లాక్ డౌన్ లు, ఇతర ఆంక్షలు అమలు చేసుకుంటూ పోవాల్సి వస్తుందని సీడీడీఈపీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీ నారాయణన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: