రైతులు పండించే పంటకు మద్దతు ధర లభించడం సాధారణ రోజుల్లోనే కష్టం.. అలాంటిది ఈ కరోనా సంక్షోభ సమయంలో మామూలు ధర లభించాలనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. అటు పొలంలో పంటకు రేటు పెరగడం లేదు...ఇటు వినియోగదారుడికీ రేటు తగ్గడం లేదు. ఇంత సంక్షోభ సమయంలో కూడా ఈ రెండు వర్గాలకు న్యాయం జరగడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, వ్యూహాత్మక లోపాలతో... అటు పండించే వారు...ఇటు వినియోగించేవారు.. వీళ్లిద్దరూ నష్ట పోతున్నారు. 

 

కరోనా కారణంగా అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ వ్యవసాయ ఉత్పత్తులను దారుణంగా దెబ్బతీసింది. ఎగుమతులతో కళకళ లాడే మార్కెట్లు మూత పడడం, రవాణా నిలిచిపోవడంతో... పోలాల్లోనే పంట పాడయ్యే పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో పండుతున్న అరటి.. 10 రాష్ట్రాలకు పైగా ఎగుమతి అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. కడప,అనంతపురం తో పాటు గోదావరి జిల్లాల్లో భారీగా సాగు చేస్తున్నారు రైతులు. అయితే లాక్‌డౌన్‌ దెబ్బకు అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో రైతులకు మంచి ధర లభిస్తుంది. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది.

 

పంట పండించే రైతులకు మద్దతు ధర లభించడం లేదు...అదే సమయంలో వినియోగదారులకు కూడా తక్కవ రేటుకు పండ్లు దొరకడం లేదు. సాదారణ రోజుల్లో అరటి చక్కర కేళీ గెల 250 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 100 నుంచి 150 లోపు పలుకుతోంది. కరోనా దెబ్బకు సగం ధర పడిపోయింది. ప్రస్తుతం రైతుకు దక్కుతున్న రేటు చూస్తే... వినియోగదారులకు కూడా తక్కువ ధరలకే పండ్లు లభించాలి. కానీ హోల్‌సేల్‌ నుంచి చిల్లర మార్కెట్‌ వరకు.. ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. గతంలో మాదిరే... డజను 40 నుంచి 60 వరకు అమ్మేస్తున్నారు. ఇప్పుడు ధర తగ్గించి అమ్మితే... ఆ తర్వాత కూడా ఇదే ధరను కొనసాగించాల్సి వస్తుందని వ్యాపారులు ధరలు తగ్గించడం లేదు. దీంతో పట్టణ పాంత్రాల్లో డిమాండ్ కు మించిన పంట దిగుబడి పొలాల్లో ఉన్నప్పటికీ... ఇటు రైతు గానీ, అటు వినియోగదారుడు గానీ లాభపడటం లేదు. 

 

ఈ పరిస్థితి కేవలం అరటి రైతులదే కాదు. బొప్పాయి, మామిడి, కర్భూజా, పుచ్చకాయ రైతులదీ ఇదే పరిస్థితి. వాస్తవంగా రాష్ట్రంలో సాగయ్యే ఉద్యాన పంటలు.. బారీ మొత్తంలో ఎగుమతి అవుతుంటాయి. పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలతో పాటు...ఉత్తరాదిలోనూ ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సీజన్ లో లభించే మామిడికి ఫుల్‌ గిరాకీ ఉండేది. కానీ లాక్‌ డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాలలో మార్కెట్ లు తెరవని పరిస్థితి నెలకొనడంతో... మార్కెటింగ్ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. కృష్ణా జిల్లా నూజివీడు, తిరువూరు నియోజవకర్గాలో మామిడి పంట బాగా సాగవుతుంది.గతంలో రకాన్ని బట్టి.. టన్నుకు 15 వేల నుంచి 25 వేల వరకు ధర పలికింది. ఇప్పుడు మాత్రం సగం ధరకు కొనడానికి కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదు.

 

మరోవైపు రిటైల్ మార్కెట్లో పండ్లు విరివిగా దొరకడం లేదు. ఈవిషయంలో మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంటను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వమే చేరవేయగలిగితే అటు రైతుకు మంచి రేటు వస్తుంది...ఇటు వినియోగదారుడుకి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రూట్ బాస్కెట్ అంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కనీసప్రభావం చూపడం లేదు. జిల్లా పరిధిలో దొరికే పంటలను కూడా పట్టణాలకు తరలించడంలో విఫలమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: