ఇప్ప‌ట్లో అప్పుడే క‌రోనా వైర‌స్ క‌థ ముగిసిపోదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది.  వైర‌స్‌తో మ‌నం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. కరోనా నుంచి మానవాళిని రక్షించే వ్యాక్సిన్‌ ఎప్పుడు సాకారం అవుతుందనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వ్యాక్సిన్‌ పరిశోధన చివరి అంకానికి చేరుకున్నట్టు తెలుస్తున్నది. గురువారం నుంచి మానవులపై వ్యాక్సిన్‌ పరీక్షలు (హ్యూమన్‌ ట్రయల్స్‌) మొదలుపెడుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాంకాక్‌ ప్రకటించారు. 

 

బ్రిటన్‌లో రకరకాల కరోనా వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్‌లో జరుగుతున్న టీకా పరీక్షలు మే నెల మధ్యనాటికి లేదా చివరినాటికి బలమైన రోగనిరోధకత చూపితే ఇక ముందుకు దూకడమేనని ఆ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ శనివారం చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిశోధన దశలో ఉన్న ఏదో ఒక వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం బ్రిటన్‌ ప్రభుత్వం 20 మిలియన్ల పౌండ్లను ప్రకటించింది. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకులకు కూడా మరో 22.5 మిలియన్‌ పౌండ్లను ఇస్తున్నట్ట్లు స్పష్టం చేసింది. 

 

ఇదిలాఉండ‌గా, కరోనా వ్యాక్సిన్‌ కోసం మొదటి ఔషధ పరీక్షను నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు జర్మనీ ప్రకటించింది. జర్మనీ సంస్థ బయోన్‌టెక్‌, అమెరికా సంస్థ ఫిజర్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను గ్రీన్‌-లైటింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా మనుషులపై ప్రయోగించనున్నట్టు వెల్లడించింది. పరీక్షలో వచ్చిన ఫలితాలను విశ్లేషించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఆమోదం తెలుపుతామని జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా,  క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌వ హ‌క్కుల సంక్షోభం ఏర్ప‌డిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు.  వైర‌స్ విస్త‌రిస్తున్న తీరు చూస్తుంటే.. మాన‌వ సంక్షోభం కాస్త‌.. మాన‌వ హ‌క్కుల స‌మ‌స్య‌గా మారిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: