ఏపీలోని ప‌రిస్థితుల‌పై రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయరంగంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిత్యం సమీక్షలు చేస్తున్నారని అన్నారు. ``మీడియాలో కొంతమంది, కొన్ని సంస్ధలు పనిగట్టుకుని అవాస్తవాలను,అబధ్దాలను ప్రచారం చేస్తున్నారు. కరోనాపై అందరం కలసికట్టుగా యుధ్దం చేస్తున్నాం. ఈ యుధ్దంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని కూడా లేకుండ అబధ్దాలను, అభూత కల్పనలు ప్రచారం చేయడం చాలా బాధాకరం.` అని వ్యాఖ్యానించారు. 

 

``ఈనాడు పత్రికలో అమ్మబోతే అడవి అనే బ్యానర్ స్టోరీని ప్రచురించారు. ఒకపక్క విజయవాడ కేదారేశ్వరపేటలో పడి ఉన్న అరటి, మరోవైపు రైతు అమ్ముకోలేక వదిలేసిన పుచ్చ అని చెప్పి ఫోటోలు వేశారు. మొన్నచూస్తే పౌల్ట్ర్రీ చాలా కష్టాలలో ఉందని మేత లేకపోతే టమాటాలు వేసి పెంచుతున్నారని జనం నవ్వుకునేలా రాసుకొచ్చారు. ఏం ప్రయోజనాలు ఆశించి ఇలాంటివి రాస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. సీఎం ఆదేశాల మేరకు విజయవాడ కేదారేశ్వరిపేటకు నేను, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి కలిసి పరిశీలించేందుకు వెళ్లాం. అక్కడ రైతుబజార్‌లో వాస్తవాలు చూస్తే ప్రచురించిన ఫోటో చూస్తే అది.... ఈనెల 14 వతేదీన కడప,అనంతపురం జిల్లాల నుంచి అరటి తీసుకువచ్చినప్పటి ఫోటో. రికార్డులు పరిశీలించాం. రైతుబజార్ అధికారులతో, స్దానికులతో మాట్లాడాం. 14 వతేదీన అరటి రైతుబజార్ కు వచ్చింది. జ‌న‌సందోహంగా ఉంటుందని కేదారేశ్వరిపేట రైతుబజార్‌ను క్లోజ్ చేసి ఐదు రైతుబజార్లుగా వికేంద్రీకరించి వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటుచేశాం.14 వతేదీన వచ్చిన అరటిని కేదారేశ్వరపేట రైతుబజార్ లో అన్ లోడ్ చేసి పెట్టారు.15,16,17 తేదీలలో మొబైల్ రైతుబజార్లకు,వికేంద్రీకరించిన రైతుబజార్లకు సరఫరా చేశారు. 18 వతేదీన మళ్లీ అరటి వచ్చింది.వాటిని కూడా 18,19,20 తేదీలలో రైతుబజార్లకు పంపించేశారు.నేడు అక్కడ ఒక్క అరటి పండు కూడా లేదు.దురదృష్టం ఏమంటే ఈనాడులో ఈరోజు ఫ్రంట్ పేజీలో టాప్ లో అరటి మగ్గిపోతుంటే కొనేవాడులేక ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నట్లుగా వార్తను ప్రచురించారు.
ఇది అన్యాయం,వక్రీకరించడం కాదా...ఎందుకీ వక్రీకరణ అని అడుగుతున్నాం.`` అని మంత్రి క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు.

 

``ఓ టమాటా రైతు నేను పంటను అమ్ముకోలేకపోతున్నానని వీడియో పెడితే చాలామంది మీడియామిత్రులు కూడా అది చూశారు. అది ముఖ్యమంత్రి కూడా చూసి ఆ రైతుతో మాట్లాడమంటే మార్కెటింగ్ అధికారితో మాట్లాడి ఓ కార్పోరేట్ సంస్ధతో మాట్లాడి ఆ పంటను మొత్తం కొనిపించడం జరిగింది. ఇది వాస్తవం. కరోనా వచ్చిన కొత్తలో చికెన్ తింటే,గుడ్డు తింటే కరోనా వస్తుందనే ప్రచారం జరిగినప్పుడు పౌల్ర్టీ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనైంది అప్పుడు నెక్ సంస్ధతో మాట్లాడి వారికి కావాల్సిన సహాయం అందిస్తూ బయట రాష్ర్టాలకు వెళ్లడానికి అనుమతులు ఇచ్చి, దాణాకు పర్మిషన్ ఇచ్చి పలు సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రచారం కూడా చేయడం జరిగింది. చికెన్ ,గుడ్డు తినడం వల్ల కరోనా రాదని ప్రచారం చేయడం వల్ల ఈరోజు వాటి రేటు స్ధిరీకరణ జరిగింది. వాస్తవాలు ఇవి.`` అని మంత్రి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: