లాక్‌డౌన్‌ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇంకా ప్ర‌జ‌ల్లో ఈ ప‌రిస్థితి విష‌యంలో సీరియ‌స్‌నెస్ రావ‌డం లేదంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎక్కువ‌గా నివ‌సిస్తున్న హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్ ప‌రిధిలో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను ఓ బాధ్యతగా పాటించడంలో నగరవాసులు విఫలమవుతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అందరూ ఇండ్లలో ఉండాలని ముఖ్యమంత్రి నుంచి పోలీసుల వరకు దండం పెట్టి కోరుతున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోనట్టే ప్రవర్తిస్తున్నారు.ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూడు కమిషనరేట్ల ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాల్లో మొత్తం 10 లక్షలకు పైగా చలాన్లు జారీ అయ్యాయి. లక్షకు పైగా వాహనాలను సీజ్‌ చేశారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

 


నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నా.. వాటిని సాకుగా చూపిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ప్రతి రోజు వాహనాలు సీజ్‌ చేస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.  ఈ విషయాన్ని  హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టి .. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేశారు. పాసులను దుర్వినియోగం చేస్తున్న వాహనాలను కూడా సీజ్‌ చేశారు.లాక్‌డౌన్‌  ఉల్లంఘనదారులపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించడంతో మూడు కమిషనరేట్ల బాస్‌లు అప్రమత్తమై అనవసరంగా రోడ్లెక్కిన వాహనాలను ఎక్కడికక్కడ సీజ్‌ చేయాలని ఆదేశించడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

 

రోడ్డు ఎక్కిన ప్రతి వాహనంపై నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదుచేసి.. సీజ్‌ చేశారు. కొన్ని చోట్ల పాసులున్నా.. మీడియా ప్రతినిధులైనా.. ఎవరినీ కూడా వదలకుండా చెక్‌పోస్టుల వద్ద నిలిపివేశారు. తమకు ఉన్నతాధికారులు చెబితేనే వదులుతామంటూ క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది పేర్కొన్నారు. పాసులు దుర్వినియోగం చేసిన వాహనాలను అక్కడికక్కడే సీజ్‌ చేశారు.   వీటన్నింటిపై లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పోలీసులు కోర్టుల్లో చార్జీషీటులను దాఖలు చేయనున్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఆధారంగా ఉల్లంఘనదారులకు జరిమానా లేదా  జైలు శిక్ష  విధించనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: