కరోనా లాక్‌డౌన్‌తో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట అమ్మే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. 

 

ఆరుగాలం కష్టపడి పంట పండించని అన్నదాత.. ఇప్పుడు ఆ పంటను అమ్ముకోడానికి నానా కష్టాలు పడుతున్నారు. మొన్నటి వరకు కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో అల్లాడిస్తే.. తాలు, తరుగు పేరుతో ప్రస్తుతం రైతులను ఇబ్బంది పెడుతున్నారు రైస్‌మిల్లర్లు. లాక్‌డౌన్‌ సమయంలో రైస్ మిల్లర్లు తూకాల్లో కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైస్ మిల్లర్ల దోపిడీ నుంచి ప్రభుత్వమే తమను కాపాడాలంటున్నారు.

 

అసలే కరోనా దెబ్బకు కుదలైన ధాన్యం రైతులను .. రైస్‌ మిల్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. నాణ్యతతో పాటు.. లేనిపోని కొర్రీలు పెడుతూ అందినకాడికి రైతుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నదాతలకు ఇచ్చే డబ్బుల్లో ఇష్టానుసారంగా కోత పెడుతున్నారు. క్వింటాకు మూడు నుంచి ఐదు కేజిల వరకు తరుగు పేరుతో తీసేస్తున్నారు. కోనుగోలు కేంద్రం దగ్గర ఒక లెక్క ... రైస్‌మిల్లుకు పోయాక మరో లెక్క అన్నట్టుగా దోపిడీ జరుగుతోంది. లోడ్ దించాలంటే మిల్లుల యజమానులు చెప్పిన దానికి రైతులు అంగీకరించాల్సిందే. లేదంటే లోడు బండిలోనే ఉంటుంది. ఇదేమని అడిగిన రైతుల్ని..  మీ ధాన్యం మీరు తీసుకెళ్లండంటూ దబాయిస్తున్నారు. ఆకాల వర్షాల భయంతో చేసేదేమీలేక.. రైతులు రైస్ మిల్లుర్స్‌ చెప్పినట్లే వినాల్సి వస్తోంది. 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవరూ ధాన్యం కొనుగోలు చేయడం లేదన్న ఆవేదనతో రైతులు పంట తగలబెట్టారు. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రైస్ మిల్లర్ల వల్ల నష్టపోతున్నామని ఆరోపిస్తూ...రైతులు పంట తగలబెట్టి నిరసన వ్యక్తంచేశారు. రైస్ మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

జగిత్యాల జిల్లా జాబితాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు రైతులు. పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల-గొల్లపెల్లి రహదారిపై బైఠాయించారు. మిల్లర్లు తాలుపేరిట తమను మనోవేదనకు గురిచేస్తున్నారంటున్న రైతులు.. ధాన్యం కొనుగోలును అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న  రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా పంటల కొనుగోళ్ల విషయంలో మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు రైతులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: